త్వరలో 180 భారత్ గౌరవ్ రైళ్ళు : రైల్వే మంత్రి

ABN , First Publish Date - 2021-11-23T23:15:06+05:30 IST

పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడమే

త్వరలో 180 భారత్ గౌరవ్ రైళ్ళు : రైల్వే మంత్రి

న్యూఢిల్లీ : పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కొత్తగా 180 భారత్ గౌరవ్ రైళ్ళను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం చెప్పారు. ఈ రైల్వే సేవల నిర్వహణ బాధ్యతలను చేపట్టేందుకు దరఖాస్తులను ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ రైళ్ళ కోసం 3,033 బోగీలను గుర్తించినట్లు చెప్పారు. 


ఓ వార్తా సంస్థ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం, భారత్ గౌరవ్ రైళ్ళ కోసం 3,033 బోగీలను గుర్తించినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ రైళ్ళ నిర్వహణ కోసం దరఖాస్తుల స్వీకరణ మంగళవారం ప్రారంభమైందని చెప్పారు. ఈ పథకానికి మంచి స్పందన లభిస్తోందన్నారు. ఈ బోగీలను ఆధునికీకరించి, రైళ్ళను నడుపుతారని చెప్పారు. పార్కింగ్, మెయింటెనెన్స్, ఇతర సదుపాయాల విషయంలో రైల్వేలు సహాయపడతాయని చెప్పారు. పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ రైళ్ళను ప్రవేశపెట్టబోతున్నామన్నారు. 


రామాయణ్ ప్రత్యేక రైళ్ళలోని సిబ్బంది కాషాయ వస్త్రాలు ధరించడంపై వెల్లువెత్తిన నిరసననను ప్రస్తావించినపుడు అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ, దీని నుంచి తాము గుణపాఠం నేర్చుకున్నామని చెప్పారు. సంస్కృతికి సంబంధించిన అంశాల్లో అనేక సున్నితమైన విషయాలు ఉంటాయన్నారు. డిజైనింగ్, ఆహారం, వస్త్రధారణ, ఇతర విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. 


రాయాయణ్ ప్రత్యేక రైళ్ళలో సర్వింగ్ స్టాఫ్ కాషాయ వస్త్రాలు ధరించాలనే నిబంధనను రైల్వే శాఖ ఉపసంహరించిన సంగతి తెలిసిందే. 


Updated Date - 2021-11-23T23:15:06+05:30 IST