వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వండి.. మోదీకి లేఖ రాసిన సోనియా

ABN , First Publish Date - 2021-05-20T22:04:10+05:30 IST

కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు ఉచిత విద్య అందించడం ద్వారా వారి

వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వండి.. మోదీకి లేఖ రాసిన సోనియా

న్యూఢిల్లీ: కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు ఉచిత విద్య అందించడం ద్వారా వారి భవిష్యత్తు భరోసా ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీకి కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ లేఖ రాశారు. ఈ విపత్కర, విషాద పరిస్థితుల్లో వారిని ఆదుకుని ఉజ్వల్ భవిష్యత్ అందించాలని ఆ లేఖలో కోరారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను, కుటుంబంలో సంపాదించే వ్యక్తులను కోల్పోయిన చిన్నారులకు నవోదయ విద్యాలయాల్లో ఉచిత విద్య అందించాలని కోరుతూ ప్రధాని లేఖ రాసినట్టు సోనియా తెలిపారు. 


వారికి సంభవించిన అనూహ్యమైన విషాదం తర్వాత చిన్నారులకు గొప్ప భవిష్యత్తు కోసం ఆశలు కల్పించాల్సిన అవసరం ఓ దేశంగా మనకు ఉందని తాను భావిస్తున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా పిల్లలు తమ తండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయినట్టు వార్తలు వస్తున్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాలను తన భర్త, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఏ లక్ష్యంతో ఏర్పాటు చేసిందీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.


గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ నాణ్యమైన విద్య అందించడం రాజీవ్ లక్ష్యంగా ఉండేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ విద్యాలయాలు దేశవ్యాప్తంగా 661 ఉన్నాయని సోనియా పేర్కొన్నారు. కాగా, కరోనా కారణంగా దేశవ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది చిన్నారులు సంపాదించే ఇంటి పెద్దనో, తల్లిదండ్రులనో కోల్పోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

Updated Date - 2021-05-20T22:04:10+05:30 IST