మమతకు శత్రువుగా మారబోతున్న అత్యంత సన్నిహితుడు!

ABN , First Publish Date - 2021-03-21T22:31:23+05:30 IST

అధికార తృణమూల్ కాంగ్రెస్‌ను వీడి ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్న సువేందు అధికారి తండ్రి శిశిర్

మమతకు శత్రువుగా మారబోతున్న అత్యంత సన్నిహితుడు!

కోల్‌కతా: అధికార తృణమూల్ కాంగ్రెస్‌ను వీడి ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్న సువేందు అధికారి తండ్రి శిశిర్ అధికారి (79) కూడా టీఎంసీకి హ్యాండిచ్చారు. నేడు ఆయన కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. మేదినీపూర్‌లోని ఎగ్రాలో నేడు కేంద్ర మంత్రి అమిత్‌షాతో కలిసి ఆయన వేదిక పంచుకున్నారు. ‘దురాగతాల నుంచి బెంగాల్‌ను రక్షించండి’ అంటూ వేదికపై నుంచి ప్రజలకు పిలుపునిచ్చిన ఆయన ‘జై శ్రీరామ్’ అని నినదించారు.  


శిశిర్ అధికారి 23 ఏళ్లపాటు తృణమూల్ కాంగ్రెస్‌తోనే ఉన్నారు. మమతకు అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన ఆయన ఇప్పుడు ఆమెకు శత్రువుగా మారబోతున్నారు. మన్మోహన్‌సింగ్ ప్రభుత్వ హయాంలో శిశిర్ ఆరేళ్లపాటు మంత్రిగానూ పనిచేశారు. ప్రతిష్ఠాత్మక దిఘ-శంకర్‌పూర్ అభివృద్ధి మండలి చైర్మన్‌గా, తృణమూల్ జిల్లా యూనిట్ చీఫ్‌గా ఉన్న ఆయనను ఈ ఏడాది మొదట్లో తొలగించారు.  


ఈ నెల 13న బీజేపీకి చెందిన హుగ్లీ ఎంపీ, ఆ పార్టీ చుంచురా అసెంబ్లీ అభ్యర్థి లాకెట్ చటర్జీ కలిసి శిశిర్ ఇంటికెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. అక్కడే లంచ్ చేశారు. ఆ తర్వాతి రోజే ఆయన బీజేపీ నేత మన్‌సుఖ్ మాండ్వియాను కలవడం పుకార్లకు తావిచ్చింది. శిశిర్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. నేడు ఎగ్రా బయలుదేరడానికి ముందు శిశిర్ అధికారి మాట్లాడుతూ.. తాను వారి (టీఎంసీ నేతలు) కారణంగా బీజేపీలో చేరబోతున్నట్టు చెప్పారు. వారు అనుకున్నదే జరుగుతోందని, ఇప్పుడు తానేం చేయగలనో చూపిస్తానని అన్నారు. 


సువేందు అధికారి బీజేపీలో చేరిన తర్వాత ఆయన సోదరుడు సౌమేందు అధికారి కూడా బజీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు శిశిర్ అధికారి కమలం గూటికి చేరుతుండగా, ఆయన మరో కుమారుడు, తమ్లూక్ తృణమూల్ ఎంపీ దిబ్యేందు అధికారి కూడా పార్టీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది.

Updated Date - 2021-03-21T22:31:23+05:30 IST