కొవిడ్‌కు చెక్ పెట్టేందుకు మధ్య ప్రదేశ్ వినూత్న నిర్ణయం

ABN , First Publish Date - 2021-03-23T01:29:47+05:30 IST

కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో మధ్య ప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. మాస్క్‌లు, భౌతిక దూరం...

కొవిడ్‌కు చెక్ పెట్టేందుకు మధ్య ప్రదేశ్ వినూత్న నిర్ణయం

భోపాల్: కొవిడ్-19 మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో మధ్య ప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. మాస్క్‌లు, భౌతిక దూరం పాటించడం తదితర జాగ్రత్తలను ప్రజలకు గుర్తుచేసేందుకు వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ నెల 23 నుంచి వారం రోజులపాటు ప్రతిరోజూ రెండుసార్లు సైరన్ మోగిస్తారు. ఉదయం 11 గంటలకు ఒకసారి, సాయంత్రం 7 గంటలకు ఓసారి సైరన్ మోగుతుందని ముఖ్యమంత్రి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఇవాళ జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘మాస్కులు ధరించడం అనేది అత్యంత ముఖ్యమైన విషయం. అందుకే మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. పరిస్థితులు మన చేయిదాటి పోనివ్వద్దు...’’ అని పేర్కొన్నారు. కాగా హోళీ సహా ఇక ముందు జరిగే అన్ని పండుగలను ప్రజలు తమ ఇళ్లలోనే జరుపుకోవడం మంచిదన్నారు. ఇండోర్, భోపాల్ సహా పలు ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతుండడంపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే మధ్య ప్రదేశ్‌లోని భోపాల్, ఇండోర్‌ నగరాల్లో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. 

Updated Date - 2021-03-23T01:29:47+05:30 IST