పంజాబ్‌ పీసీసీ అధ్యక్ష పదవికి సిద్దూ రాజీనామా

ABN , First Publish Date - 2021-09-29T07:02:21+05:30 IST

పంజాబ్‌ పీసీసీ అధ్యక్ష పదవికి నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ రాజీనామా చేశారు. కొత్త

పంజాబ్‌ పీసీసీ అధ్యక్ష పదవికి సిద్దూ రాజీనామా

  • మంత్రివర్గ కూర్పుపై అసంతృప్తితోనే
  • ఆప్‌లో చేరతారని ఊహాగానాలు
  • ఢిల్లీ పర్యటనలో అమరీందర్‌ సింగ్‌
  • బీజేపీ అగ్రనేతలను కలుస్తారని వార్తలు
  • మళ్లీ వేడెక్కిన పంజాబ్‌ రాజకీయాలు


చండీగఢ్‌, సెప్టెంబరు 28: పంజాబ్‌ పీసీసీ అధ్యక్ష పదవికి నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ రాజీనామా చేశారు. కొత్త క్యాబినెట్‌ కూర్పు పట్ల అసంతృప్తితోనే ఆయన పదవి నుంచి వైదొలగినట్టు తెలిసింది. సిద్ధూకి సంఘీభావంగా మంత్రి రజియా సుల్తానా కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవలే ముఖ్యమంత్రిగా నియమితులైన చరణ్‌జిత్‌ సింగ్‌ చన్ని గత ఆదివారం నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటుచేశారు. దీనికి ముందు.... ఇసుక తవ్వకాలకు సంబంధించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రణగుర్జీత్‌ సింగ్‌కు మంత్రివర్గంలో స్థానం కల్పించవద్దని కోరుతూ కొంతమంది ఎమ్మెల్యేలు సిద్దూకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఇవే ఆరోపణలపై అమరీందర్‌ సింగ్‌ మంత్రివర్గం నుంచి రణగుర్జీత్‌ సింగ్‌ ఉద్వాసనకు గురయ్యారు.


అయితే సీఎం చన్ని ఆయనకు మళ్లీ మంత్రిపదవి కట్టబెట్టడాన్ని సిద్దూ అడ్డుకోలేకపోయారు. దీంతోపాటు కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న ఇంకొందరిపైనా సిద్దూ అసంతృప్తితో ఉన్నారు. పీసీసీ ఎస్సీ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్న రాజ్‌కుమార్‌ చబేవాల్‌కు మంత్రివర్గంలో స్థానం కోసం సిద్దూ కొంతకాలంగా ప్రయత్నిస్తూ వచ్చారు. అయితే రాజ్‌కుమార్‌కు పదవి దక్కకపోగా... చన్నీకి బంధువైన అరుణా చౌధరికి మంత్రివర్గంలో స్థానం లభించింది. అరుణా చౌధరి తన సొంత నియోజకవర్గంలో ప్రజల నుంచి అసంతృప్తిని ఎదుర్కొంటున్నట్టు చాలాకాలంగా ప్రచారంలో ఉంది.


తాజా క్యాబినెట్‌ కూర్పులో కులాల సమీకరణ పట్ల కూడా సిద్దూ అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ జనాభాలో 30శాతం ఉన్న మజాబీ సిక్కులను పక్కనబెట్టి... తన సొంత కులానికే సీఎం చన్ని అధిక ప్రాధాన్యం ఇచ్చారని సిద్దూ భావిస్తున్నట్టు తెలిసింది. అయితే రాహుల్‌ గాంధీ, పీసీసీ ఆమోదం తర్వాతే మంత్రివర్గం ఎంపిక జరిగిందని చన్ని మద్దతుదారులు అంటున్నారు.



ఆప్‌లో చేరతారని ప్రచారం

సిద్దూ రాజీనామాతో పంజాబ్‌ రాజకీయాలు మళ్లీ ఒక్కసారిగా వేడెక్కాయి. ఆయన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)లో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. పంజాబ్‌ ఎన్నికల కోసం సీఎం అభ్యర్థిగా ఆప్‌ ఇంకా ఎవరినీ ప్రకటించలేదు. సిద్దూ ఒత్తిడికి తలొగ్గి పంజాబ్‌ మంత్రివర్గంలో మళ్లీ మార్పులు చేస్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.


మరోవైపు మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌ ఢిల్లీ చేరుకున్నారు. బీజేపీ నేతలు అమిత్‌ షా, జేపీ నడ్డాతో ఆయన సమావేశం అవుతారని, బీజేపీలో చేరతారని వార్తలు వెలువడ్డాయి. వీటిని అమరీందర్‌ ఖండించారు. వ్యక్తిగత పనుల నిమిత్తమే ఢిల్లీకి వచ్చినట్టు చెప్పారు. సిద్దూ రాజీనామాపై కూడా అమరీందర్‌ స్పందించారు. పంజాబ్‌ సీఎం పదవికి చన్ని సరిపోడని చెప్పాను కదా అంటూ సిద్దూని ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. సిద్దూతో తీవ్ర విభేదాల కారణంగానే అమరీందర్‌ సీఎం పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే.


Updated Date - 2021-09-29T07:02:21+05:30 IST