కర్ణాటక ‘పుర’ ఎన్నికల్లో బీజేపీకి షాక్‌!

ABN , First Publish Date - 2021-12-31T09:02:50+05:30 IST

బీజేపీకి గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి...

కర్ణాటక ‘పుర’ ఎన్నికల్లో బీజేపీకి షాక్‌!

  • 1,185 వార్డుల్లో 431 చోట్లే గెలుపు
  • బాగా పుంజుకున్న కాంగ్రెస్‌
  • 501 స్థానాల్లో విజయకేతనం
  • వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు దిక్సూచి
  • రాష్ట్రాన్ని దక్కించుకుంటాం
  • పీసీసీ అధ్యక్షుడు శివకుమార్‌ ధీమా


బెంగళూరు, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలోని 5 కార్పొరేషన్లు, 19 మునిసిపాలిటీలు, 34 పట్టణ పంచాయతీల్లోని 1185 డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ 501 వార్డుల్లో విజయకేతనం ఎగురవేయగా.. బీజేపీ 431 వార్డుల్లో మాత్రమే గెలుపొందింది. జేడీఎస్‌ కేవలం 45 వార్డులతో సరిపెట్టుకుంది.


ఇండిపెండెంట్లు 207 వార్డుల్లో విజయం సాధించి కింగ్‌ మేకర్లుగా మారారు. ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులోని హొసపేటలో ఆమ్‌ ఆద్మీపార్టీ(ఆప్‌) బోణీ చేసింది. ఈ విజయాలతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తుండగా అధికార బీజేపీలో అంతర్మథనం ప్రారంభమైంది. యడియూరప్ప రాజకీయ వారసుడిగా లింగాయత్‌ వర్గానికే చెం దిన బసవరాజ్‌ బొమ్మైను తెరపైకి తెచ్చినా పార్టీని విజయపథంలో నడపలేకపోతున్నారన్న ఆరోపణలొస్తున్నాయి.


కాగా.. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు స్థానిక ఎన్నికల్లో విజయాలు దిక్సూచి కానున్నాయని రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ అన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని దించేందుకు కర్ణాటక ఎదురుచూస్తోందని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రణదీప్‌ సుర్జేవాలా ఢిల్లీలో అన్నారు. మతమార్పిడులకు వ్యతిరేకంగా చేసిన చట్టాలు రాష్ట్ర ప్రజలను నమ్మించలేవ ని స్థానిక ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయన్నారు.


Updated Date - 2021-12-31T09:02:50+05:30 IST