బార్జ్ మునక విషాదం.. కేంద్ర మంత్రి రాజీనామాకు శివసేన పట్టు

ABN , First Publish Date - 2021-05-21T00:57:34+05:30 IST

తౌక్తే తుపాను నేపథ్యంలో అరేబియా సముద్రంలో ముంబై తీరంలో మునిగి విషాదం నింపిన బార్జ్ ‘పి305’పై ఘటనపై విచారణ జరిపించాలని

బార్జ్ మునక విషాదం.. కేంద్ర మంత్రి రాజీనామాకు శివసేన పట్టు

ముంబై: తౌక్తే తుపాను నేపథ్యంలో అరేబియా సముద్రంలో ముంబై తీరంలో మునిగి విషాదం నింపిన బార్జ్  ‘పి305’పై ఘటనపై విచారణ జరిపించాలని శివసేన కోరింది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఓఎన్‌జీసీ చైర్మన్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ నౌక మునిగిన ఘటనలో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 38 మంది ఆచూకీ గల్లంతైంది.


ఆరేబియా స‌ముద్రంలో ఉన్న ఓఎన్‌జీసీ రిగ్గుల వ‌ద్ద ప‌నిచేస్తున్న కార్మికుల‌కు బార్జ్ నౌక‌లు ఆశ్ర‌య కేంద్రాలుగా ఉంటాయి. తౌక్టే తుఫాన్ దాటికి ‘పి305’ స‌ముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో లైఫ్ జాకెట్లు వేసుకున్న వారు మాత్రం స‌ముద్రంలోకి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. 


ఓఎన్‌జీసీ బార్జ్‌పై పనిచేస్తున్న కార్మికుల మృతి పూర్తిగా మానవతప్పిదమేనని శివసేన ఆరోపించింది. కారకులైన వారిని తీవ్రంగా శిక్షించాల్సిందేనని శివసేన పేర్కొంది. ఈ ఘటనపై అత్యున్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని శివసేన ఎంపీ, అధికార ప్రతినిధి అర్వింద్ సావంత్ కోరారు.


కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఓఎన్‌జీసీ చైర్మన్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ‘‘తౌక్తే తుపాను ఒక్కసారిగా రాలేదు. అందరికీ ముందుస్తు హెచ్చరికలు అందాయి. అలాంటప్పుడు ఆ సమయంలో బార్జ్‌ను సముద్రంలో ఎలా నిలిపి ఉంచుతారు’’ అని సావంత్ ప్రశ్నించారు. 


కొందరు అధికారుల బాధ్యతారాహిత్యం కారణంగా అమాయకులు మరణించారని సావంత్ ఆవేదన వ్యక్తం చేశారు. చమురు పరిశ్రమలో ఇది అతిపెద్ద విషాదమన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సాయం అందించడంతోపాటు ఉద్యోగాలు కూడా కల్పించాలన్నారు. కాగా, బార్జ్ మునక ఘటనలో గల్లంతైన వారి కోసం నేవీ ఈ ఉదయం ఏరియల్ సెర్చ్ ప్రారంభించింది. 

Updated Date - 2021-05-21T00:57:34+05:30 IST