ఢిల్లీ గద్దె దిశగా గొప్ప ముందడుగు : శివసేన

ABN , First Publish Date - 2021-11-02T18:11:41+05:30 IST

దాద్రా అండ్ నగర్ హవేలీ లోక్‌సభ నియోజకవర్గానికి

ఢిల్లీ గద్దె దిశగా గొప్ప ముందడుగు : శివసేన

న్యూఢిల్లీ : దాద్రా అండ్ నగర్ హవేలీ లోక్‌సభ నియోజకవర్గానికి అక్టోబరు 30న జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ప్రారంభమైంది. మొదటి గంటలోనే శివసేన అభ్యర్థి కాలాబెన్ డేల్కర్ తన సమీప ప్రత్యర్థి కన్నా 4,000కుపైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆమె మాజీ ఎంపీ మోహన్ డేల్కర్ సతీమణి. ఆయన గతంలో ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శివసేన నేత సంజయ్ రౌత్ ట్విటర్ వేదిగా స్పందిస్తూ, మహారాష్ట్రకు వెలుపల పడిన మొదటి అడుగు అని తెలిపారు. దాద్రా నగర్ హవేలీ గుండా ఢిల్లీ అధికార పీఠం దిశగా శివసేన గొప్ప ముందడుగు వేస్తోందని చెప్పారు. 


ఇదిలావుండగా, మధ్య ప్రదేశ్‌లోని ఖండ్వా లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. అధికారిక సమాచారం ప్రకారం, ఈ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి జ్ఞానేశ్వర్ పాటిల్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి రాజ్‌నారాయణ్ సింగ్ పుర్ణి కన్నా 14 వేల పై చిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో మూడు శాసన సభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రాయ్‌గావ్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ప్రతిమ బగ్రి తన సమీప ప్రత్యర్థి కల్పన వర్మ (కాంగ్రెస్) కన్నా 220 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పృథ్వీపూర్‌ శాసన సభ నియోజకవర్గంలో శిశుపాల్ సింగ్ యాదవ్ (బీజేపీ) తన సమీప ప్రత్యర్థి నితేంద్ర సింగ్ రాథోడ్ (కాంగ్రెస్) కన్నా 430 ఓట్ల ఆధిక్యంలో కనిపిస్తున్నారు. జోహట్ శాసన సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సులోచన రావత్ కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్ పటేల్ కన్నా ముందంజలో ఉన్నారు. 


Updated Date - 2021-11-02T18:11:41+05:30 IST