కదలిరండి... కలసిరండి!
ABN , First Publish Date - 2021-10-20T16:19:14+05:30 IST
అన్నాడీఎంకే స్వర్ణోత్సవాల సందర్భంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిని తానేనంటూ ప్రకటించుకున్న మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ .. అదే హోదాలో తాజాగా పార్టీ శ్రేణులకు రాసిన బహిరంగలేఖ ఆ పా

చెన్నై(chennai): అన్నాడీఎంకే స్వర్ణోత్సవాల సందర్భంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిని తానేనంటూ ప్రకటించుకున్న మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ .. అదే హోదాలో తాజాగా పార్టీ శ్రేణులకు రాసిన బహిరంగలేఖ ఆ పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. ఒకనాటి అన్నాడీఎంకే అధికార పత్రిక ‘నమదు ఎంజీఆర్’లో ‘అమ్మబాటలో నడచి అన్నాడీఎంకేని కాపాడుకుందాం... నాపై విశ్వాసముంచిన కార్యకర్తలంతా కదలిరండి, కలసి రండి’ అంటూ ఆమె పిలుపునిచ్చారు. ఆ లేఖలో ఆమె అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పేర్కొంటూ సంతకం చేశారు. అన్నాదురై అడుగుజాడల్లో నడచి, ఎంజీఆర్ ఆశయాలను నెరవేర్చేదిశగా కార్యకర్తలందరూ జయమ్మ బాటలో సత్వరం నడవాల్సిన అవసరం ఉందని శశికళ ఆ లేఖలో పేర్కొన్నారు. ‘ఐకమత్యమనే పుష్పాలను ఒక్కటిగా చేర్చుదాం, తమిళ సమాజాం అభివృద్ధే మన ధ్యేయమని ప్రజలకు ఎలుగెత్తి చాటుదాం’ అంటూ పిలుపునిచ్చారు. ప్రజలిచ్చిన తీర్పుతో అన్నాడీఎంకే అందించిన సుపరిపాలన గురించి చరిత్ర చాటిచెబుతుందని, మనలో ఏర్పడిన అభిప్రాయభేదాల వల్ల ప్రత్యర్థులకు అధికారం అప్పగించామనే విషయాన్ని అందరూ గుర్తించాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వెరవక అమ్మ బాటలో నడవాలని శపథం పూనుదామని, ప్రస్తుతం కార్యకర్తల మదిలో ఏముందో తనకు బాగా తెలుసునని వ్యాఖ్యానించారు. పార్టీ కాపాడబడుతుందని, ఈ విషయంలో ఎవరూ వెరవనవసరం లేదని తెలిపారు. అమ్మ చేతిలో పెరిగిన మనమంతా బుద్ధిమంతులమేనని, కలసికట్టుగా పయనిద్దామని, ఎక్కుపెట్టిన బాణంలా ముందుకు దూసుకుపోదామని పిలుపునిచ్చారు. ‘రాష్ట్ర భవిష్యత్తును మార్చే శక్తి అన్నాడీఎంకే శ్రేణులకే ఉంది. ప్రజలకు అండగా నిలుద్దాం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా భయపడకుండా మళ్ళీ అమ్మ బాటలో విజయపథం వైపు నడుద్దాం’ అంటూ పదేపదే పిలుపునిచ్చారు.