పరంబీర్ నన్ను కలిసిన మాట నిజమే : శరద్ పవార్
ABN , First Publish Date - 2021-03-21T23:49:49+05:30 IST
మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన ముంబై మాజీ పోలీస్ కమిషనర్

ముంబై : మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన ముంబై మాజీ పోలీస్ కమిషనర్ ఆరోపణలపై ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ ట్విటర్ వేదికగా స్పందించారు. మాజీ సీపీ పరంబీర్ సింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న తర్వాతే ఆయన ఈ ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. ఈ ఆరోపణలు తీవ్రమైనవని, వీటిపై విశ్వసనీయతగల అధికారి చేత దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. అయితే తనను పరంబీర్ కలిసిన మాట వాస్తవమేనని శరద్ పవార్ అంగీకరించారు. అయితే హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా తనకు ఏమీ చెప్పలేదన్నారు.
ముంబై నగర మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు రాసిన లేఖ గురించి తాను న్యూఢిల్లీలో జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడానని ట్విట్టర్ వేదికగా శరద్ పవార్ తెలిపారు. సంతకం లేని ఆ లేఖ నకలు తనకు అందిందని, దానిలో రెండు భాగాలు ఉన్నాయని తెలిపారు. మొదటి భాగంలో, మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ఆరోపణలు ఉన్నాయని, రెండో భాగంలో.. ముంబైలో ఆత్మహత్య చేసుకున్న డయ్యూ-డామన్ ఎంపీ దేల్కర్ కేసుకు సంబంధించి నమోదు చేయవలసిన ఎఫ్ఐఆర్ విషయంలో సీపీకి ఆయన సలహాకు వ్యతిరేకంగా ఆయన ఇచ్చిన ఆదేశాలకు సంబంధించినదని తెలిపారు. హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకి, తనకు ఈ విషయాన్ని తెలియజేసినట్లు పరంబీర్ సింగ్ తన లేఖలో పేర్కొన్నారని పవార్ తెలిపారు.
నాకు ఆ వివరాలు చెప్పలేదు
పరంబీర్ సింగ్ బదిలీ అవడానికి ముందు తనను కలిసిన మాట వాస్తవమేనని శరద్ పవార్ తెలిపారు. హోం మంత్రి అనిల్‌కు లేదా ఆయన సిబ్బందికి అప్పగించిన లేదా బదిలీ చేసిన సొమ్ము గురించి కానీ, వాస్తవంగా వసూలు చేసిన సొమ్ము గురించి కానీ తనకు పరంబీర్ సింగ్ చెప్పలేదని తెలిపారు. సింగ్ తనను కలిసినపుడు అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలుగల కారు కేసు గురించి, ఆ కేసులో లభించిన సున్నితమైన సమాచారం గురించి మాట్లాడారని తెలిపారు. ఈలోగానే మాజీ అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సచిన్ వాజే గురించి మీడియా ఆరా తీసిందన్నారు. మరోవైపు సస్పెండయిన వాజేను తిరిగి పదవిలో నియమించినట్లు తనకు కొందరు చెప్పారన్నారు.
ఆ నిర్ణయం పరంబీర్‌దే
వాజేను పునర్నియమించాలన్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కానీ, హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కానీ తీసుకోలేదన్నారు. ఈ నిర్ణయాన్ని స్వయంగా మాజీ సీపీ పరంబీర్ సింగే తీసుకున్నారన్నారు. వాజేకు ముఖ్యమైన, సున్నితమైన దర్యాప్తులను పరంబీర్ అప్పగించారన్నారు.
మృతుని భార్య ఆరోపణలతో...
మరోవైపు తన భర్త మరణం వెనుక వాజే ప్రమేయం ఉందని మన్‌సుఖ్ హిరేన్ భార్య ఆరోపించారని తెలిపారు. మృతుని భార్య స్పష్టమైన ఆరోపణ చేయడంతో ఈ విషయంపై లోతుగా దర్యాప్తు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మృతుని భార్య ఇంత తీవ్రమైన ఆరోపణ చేసినప్పటికీ పరంబీర్ సింగ్ ఎన్నడూ హోం మంత్రి అనిల్‌కు వ్యతిరేకంగా ఆరోపణలు చేయలేదన్నారు. ఆయనపై ప్రభుత్వం చర్య తీసుకున్న తర్వాత, ఆయనను తక్కువ ప్రాధాన్యతగల శాఖకు బదిలీ చేసిన తర్వాత ఆయన ఈ ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇది నిజంగా చాలా ముఖ్యమైన, సున్నితమైన కేసు అని పేర్కొన్నారు. హోం మంత్రికి వ్యతిరేకంగా ఓ అధికారి ఈ ఆరోపణలు చేసినందు వల్ల, అనేక లోపాల వల్ల రహస్య సమాచారం కొన్ని మీడియా సంస్థలకు లీక్ అవడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ఠపై ప్రభావం పడిందని పేర్కొన్నారు.
నిజాలు వెలుగు చూడాలి
ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలపై లోతైన దర్యాప్తు జరగాలని, అటు పోలీసు శాఖకు, ఇటు ప్రజలకు చాలా నమ్మకస్థుడైన అధికారి చేత లేదా వ్యక్తి చేత దర్యాప్తు చేయించాలని తెలిపారు. మహారాష్ట్ర మాజీ డీజీపీ జులియో ఫ్రాన్సిస్ రిబీరోకు ఈ బాధ్యతను అప్పగించాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు సలహా ఇస్తున్నానని తెలిపారు. రిబీరోకు గొప్ప పేరు ప్రతిష్ఠలు ఉన్నాయని, ఆయన ఈ బాధ్యతను అంగీకరిస్తే, కచ్చితంగా నిజానిజాలు బయటపడతాయని చెప్పారు. వాస్తవాలు వెలుగు చూస్తే పోలీసులను, ముఖ్యంగా ప్రభుత్వాన్ని ప్రజలు నమ్ముతారని శరద్ పవార్ పేర్కొన్నారు.