జూన్‌లో 10 కోట్ల వ్యాక్సిన్లు ఇస్తాం: సీరమ్ హామీ

ABN , First Publish Date - 2021-05-31T02:18:33+05:30 IST

జూన్‌లో పది కోట్ల కోవిషీల్డ్ డోసులు ఇస్తామని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) హామీ ఇచ్చింది. ఈ మేరకు నేడు

జూన్‌లో 10 కోట్ల వ్యాక్సిన్లు ఇస్తాం: సీరమ్ హామీ

పూణె: జూన్‌లో పది కోట్ల కోవిషీల్డ్ డోసులు ఇస్తామని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) హామీ ఇచ్చింది. ఈ మేరకు నేడు కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు రాసిన లేఖలో ఈ విషయాన్ని పేర్కొంది. టీకాల ఉత్పత్తిని పెంచేందుకు తమ ఉద్యోగులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారని తెలిపింది.


‘‘జూన్‌లో 9 నుంచి 10 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేసి సరఫరా చేస్తామని చెప్పడానికి సంతోషిస్తున్నాం’’ అని ఎస్ఐఐ తెలిపింది. మే నెలలో తాము 6.5 కోట్ల డోసులను మాత్రమే ఉత్పత్తి చేయగలిగినట్టు ఎస్ఐఐ రెగ్యులేటరీ అఫైర్స్ డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్ తెలిపారు. విలువైన మార్గదర్శకత్వం, నిరంతర మద్దతు అందిస్తున్నందుకు ఈ సందర్భంగా అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు.


నిజానికి జూన్‌లో 6.5 కోట్లు, జులైలో 7 కోట్లు, ఆగస్టు, సెప్టెంబరులో 10 కోట్ల చొప్పున వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేయనున్నట్టు ఇటీవల సీరం తెలిపింది. అయితే, జూన్‌లోనే 10 కోట్ల టీకాలను ఉత్పత్తి చేసి సరఫరా చేస్తామని తాజాగా ప్రకటించడం గమనార్హం.


దేశంలో ప్రస్తుతం కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను ఇస్తున్నారు. అయితే, టీకాల కొరతతో వ్యాక్సినేషన్ కార్యక్రమం దేశంలో మందకొడిగా సాగుతోంది. కాగా, రష్యాకు చెందిన ‘స్పుత్నిక్-వి’ వ్యాక్సిన్‌కు ప్రభుత్వం ఇటీవలే అనుమతి ఇచ్చింది.

Updated Date - 2021-05-31T02:18:33+05:30 IST