గాంధీజీపై వ్యాఖ్యలు చేసిన స్వామీజీపై దేశద్రోహం కేసు

ABN , First Publish Date - 2021-12-30T20:58:00+05:30 IST

మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేకు వందనం

గాంధీజీపై వ్యాఖ్యలు చేసిన స్వామీజీపై  దేశద్రోహం కేసు

రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్) : మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేకు వందనం చేస్తున్నానని చెప్పిన స్వామీజీ కాళీచరణ్ మహరాజ్‌పై దేశద్రోహం ఆరోపణలతో కేసు నమోదైంది. వివిధ వర్గాల మధ్య విద్వేషం, శత్రుత్వం, దురభిప్రాయాలను సృష్టించే వ్యాఖ్యలు చేసినందుకు ఈ కేసును రాయ్‌పూర్ పోలీసులు నమోదు చేశారు. 


రాయ్‌పూర్‌లోని రావణ్ భాటా మైదానంలో ఆదివారం జరిగిన ధర్మ సంసద్‌లో కాళీచరణ్ మహరాజ్ మాట్లాడుతూ, రాజకీయాల ద్వారా దేశాన్ని కబళించడమే ఇస్లాం లక్ష్యమని చెప్పారు. గాంధీజీని హత్య చేసిన నాథూరాం గాడ్సేకు తాను వందనం చేస్తున్నట్లు తెలిపారు. 


దీంతో ఆయనను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. రాయ్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్ ప్రశాంత్ అగర్వాల్ మాట్లాడుతూ, కాళీచరణ్ మహరాజ్ మధ్య ప్రదేశ్‌లోని ఖజురహో నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాగేశ్వర్ ధామ్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నారని చెప్పారు. ఆయనను గురువారం తెల్లవారుజామున 4 గంటలకు అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆయనపై రాయ్‌పూర్ మాజీ మేయర్ ప్రమోద్ దూబే ఫిర్యాదు మేరకు ఈ కేసును నమోదు చేసినట్లు చెప్పారు. వివిధ వర్గాల మధ్య విద్వేషం, శత్రుత్వాలను ప్రోత్సహించడం, బహిరంగ ప్రదేశాల్లో అశ్లీల చర్యలకు పాల్పడటం వంటి నేరారోపణలను కాళీచరణ్‌పై నమోదు చేసినట్లు తెలిపారు. 


Updated Date - 2021-12-30T20:58:00+05:30 IST