మరో 351 రక్షణ దిగుమతులపై ఆంక్షలు

ABN , First Publish Date - 2021-12-30T07:33:59+05:30 IST

రక్షణ శాఖ బుధవారం కొత్తగా 351 రక్షణ దిగుమతులపై ఆంక్షలు విధించింది. వచ్చే ఏడాది డిసెంబరు నుంచిఈ ఆంక్షలు అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. ..

మరో 351 రక్షణ దిగుమతులపై ఆంక్షలు

న్యూఢిల్లీ, డిసెంబరు 29: రక్షణ శాఖ బుధవారం కొత్తగా 351 రక్షణ దిగుమతులపై ఆంక్షలు విధించింది. వచ్చే ఏడాది డిసెంబరు నుంచిఈ ఆంక్షలు అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. గడచిన 16 నెలల్లో కేంద్రం ఆంక్షలు విధిస్తూ జారీ చేసిన జాబితాలో ఇది మూడోది. సైనిక ఉత్పత్తులు, పరికరాలను మేడ్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా.. దేశీయంగా తయారుచేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. వరసగా పలు రక్షణ దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధిస్తోంది. తాజా ఆంక్షల వలన ప్రభుత్వానికి ఏటా రూ. 3వేల కోట్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందని రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో ప్రకటించిన రక్షణ వస్తువులు లేదా పరికరాలను కేవలం భారత సంస్థలనుంచి మాత్రమే కొనుగోలు చేస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే దేశీయ తయారీకి మారిన మరో 2500 వస్తువుల జాబితాను విడుదల చేసింది. వచ్చే మూడేళ్లలో మరో 351 దిగుమతులను దేశీయ త యారీకి మార్చనున్నామని వెల్లడించింది. ఇక తాజా జాబితా విషయానికొస్తే.. వాటి లో 172 వస్తువులపై వచ్చే ఏడాది డిసెంబరు నుంచి, 89 వస్తువులపై 2023 డిసెంబరు నుంచి, 90 వస్తువులపై 2024 డిసెంబరు నుంచి ఆంక్షలు అమల్లోకి వస్తాయి. వీటిలో లేజర్‌ వార్నింగ్‌ సెన్సర్‌, హై-ప్రెజర్‌ చెక్‌ వాల్వ్‌, హై-ప్రెజర్‌ గ్లోబ్‌ వాల్వ్‌, డ్రైనేజీ ఇంట్రూజన్‌ డిటెక్షన్‌ వ్యవస్థ, వివిధ రకాలైన కేబుల్స్‌, వోల్టేట్‌ కంట్రోల్‌ ఆసిలేటర్స్‌ వంటివి ఉన్నాయి. 

Updated Date - 2021-12-30T07:33:59+05:30 IST