ఎస్సీ వర్గీకరణ చేపట్టాల్సిందే: కాంగ్రెస్‌,టీడీపీ

ABN , First Publish Date - 2021-12-15T06:57:25+05:30 IST

ఎస్సీ వర్గీకరణ చేపట్టి అన్ని వర్గాలకు న్యాయం చేయాల్సిందేనని కాంగ్రెస్‌, టీడీపీ నేతలు డిమాండ్‌ చేశారు. ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక ...

ఎస్సీ వర్గీకరణ చేపట్టాల్సిందే: కాంగ్రెస్‌,టీడీపీ

 కట్టుబడి ఉన్నాం: కేంద్ర మంత్రులు నారాయణస్వామి, మురుగన్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణ చేపట్టి అన్ని వర్గాలకు న్యాయం చేయాల్సిందేనని కాంగ్రెస్‌, టీడీపీ నేతలు డిమాండ్‌ చేశారు. ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఢిల్లీలోని తాల్‌కటోరా స్టేడియంలో జరిగిన మాదిగ విద్యార్థుల మహాసభలో కేంద్ర మంత్రులు నారాయణ స్వామి, మురుగన్‌, కాంగ్రెస్‌ ఎంపీలు రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రులు స్పష్టం చేశారు. సభలో పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ వర్గీకరణపై సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్థి ఉంటే పార్లమెంటులో టీఆర్‌ఎస్‌ ఎందుకు ప్రస్తావించడంలేదని ప్రశ్నించారు.  తాను అత్యున్నత స్థానానికి ఎదగడానికి, తన కుటుంబ కోసం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తానో ఎస్సీ వర్గీకరణ కోసం అంతే చిత్తశుద్ధితో పనిచేస్తానని ప్రకటించారు. వర్గీకరణకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో రాగానే తెలంగాణ బిల్లు లాగా వర్గీకరణ బిల్లును తీసుకొస్తామని, లక్ష్యం నెరవేరే వరకు మంద కృష్ణ మాదిగతో ఉంటానని హామీ ఇచ్చారు. ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు మద్దతివ్వడంలో కాంగ్రెస్‌ ఎప్పుడూ వెనుకాడలేదని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ వర్గీకరణకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.  ఎస్సీ వర్గీకరణకు టీడీపీ మద్దతుగా నిలుస్తుందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ ప్రకటించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు తాను ఈ మహాసభకు హాజరయ్యానని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టకపోతే ఆంఽధ్ర ప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ నేతలను తిరగనివ్వబోమని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. వర్గీకరణ కోసం గత 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని, గతంలో యూపీఏ ప్రభుత్వం వర్గీకరణ కోసం ప్రయత్నం చేసిందని తెలిపారు. కానీ ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు వర్గీకరణ చేపట్టలేదని విమర్శించారు. 

Updated Date - 2021-12-15T06:57:25+05:30 IST