స్కూళ్ల పునఃప్రారంభానికి ఏర్పాట్లు

ABN , First Publish Date - 2021-08-10T13:29:58+05:30 IST

రాష్ట్రంలో కరోనా లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన ప్రభుత్వ పాఠశాలలను పునఃప్రారంభించేం దుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు ముమ్మర ఏర్పాట్లు చేపడుతు న్నారు. కరోనా వైరస్‌ మూడో దశ వ్యాప్తి ముందస్తు నిరో

స్కూళ్ల పునఃప్రారంభానికి ఏర్పాట్లు

- షిఫ్టుపద్ధతిలో తరగతులు

- కాలేజీల్లో ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభం


చెన్నై: రాష్ట్రంలో కరోనా లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన ప్రభుత్వ పాఠశాలలను పునఃప్రారంభించేం దుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు ముమ్మర ఏర్పాట్లు చేపడుతు న్నారు. కరోనా వైరస్‌ మూడో దశ వ్యాప్తి ముందస్తు నిరోధక చర్యలను అనుసరించి షిఫ్టు పద్ధతిలో తరగతులు నిర్వహించేందుకు పాఠశాలల్లో ఏర్పాట్లు చేపడుతున్నారు. గతేడాది మార్చి 24 నుంచి కరోనా లాక్‌డౌన్‌ను వివిధ రకాలుగా అమలు చేస్తుండటంతో పాఠశాలలను మూసివేశారు. నెలల తరబడి ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించారు. జనవరి 19న 10, 12 తరగతులు ప్రారంభించారు. ఆ తర్వాత 9, 11 తరగతులు విద్యార్థులకు పాఠశాలలు తెరిచారు. అయితే నెల రోజులపాటు మాత్రమే ఈ పాఠశాలలు కొనసాగాయి. ఆ తర్వాత కరోనా వైరస్‌ వ్యాప్తి ఉగ్రరూపం దాల్చడంతో పాఠశాలలు మూతపడ్డాయి. మళ్ళీ ఆన్‌లైన్‌లో తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం రెండో దశ కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో పాఠశాలలను తెరిచే విషయమై విద్యాశాఖ ఉన్నతాధికారులు, విద్యానిపుణులు పలుమార్లు సమావేశమై చర్చించారు. అదే సమయంలో పాఠశాలలు తెరిస్తే పాటించాలని కరోనా నిబందనలు గురించి కూడా సమీక్షించారు. ఈ పరిస్థితుల్లో సెప్టెంబర్‌ ఒకటి నుంచి 9 నుంచి 12 తరగతుల విద్యార్థుల కోసం పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ అధి కారులు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులకు ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో షిఫ్టు పద్ధతిలో తరగతులు నిర్వహించాలన్నారు. అందుకు తగినట్ట్టు తరగతుల టైమ్‌టేబుల్‌లో మార్పులు చేయాలన్నారు. ప్రతి పాఠశాలలోనూ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, స్థానిక వైద్యుల ఫోన్‌ నెంబర్లతో బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.


కాలేజీ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు

రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ఫస్టియర్‌ మినహా తక్కిన కాలేజీ విద్యార్థులందరికీ ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభమయ్యాయి. ఆర్ట్స్‌ సైన్స్‌, ఇంజనీరింగ్‌, వృత్తివిద్య విభాగంలో విద్యార్థులందరికి ఆన్‌లైన్‌ తరగతుల్ని ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కాలేజీల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఫస్టియర్‌ విద్యార్థులకు కూడా త్వరలో ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించనున్నారు.


ఇంజనీరింగ్‌ కోర్సులకు 1.28 లక్షల దరఖాస్తులు

రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలకు 1.28లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు ప్రకటించారు. బీఈ, బీటెక్‌లో ప్రవేశాలకు జూలై 26 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటివరకూ లక్షా 28 వేల 844 మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో 97వేల 489 మంది ఫీజు కూడా చెల్లించారని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 457 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో అడ్మిషన్లకు దరఖాస్తు గడువు ఈనెల 24న ముగియనుంది. ఇదే విధంగా ఆర్ట్స్‌,సైన్స్‌ కళాశాలల్లో 2.79లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 

Updated Date - 2021-08-10T13:29:58+05:30 IST