శశికళ డిశ్చార్జ్‌

ABN , First Publish Date - 2021-02-01T06:51:02+05:30 IST

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ కరోనా నుంచి కోలుకున్నారు. ఆదివారం బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రి నుంచి ఆమె బెంగళూరు

శశికళ డిశ్చార్జ్‌

  • ఆస్పత్రి నుంచి బెంగళూరు రిసార్టుకు శశికళ
  • జ్యోతిషుడి సూచనతో వారం పాటు బెంగళూరు రిసార్టులో
  • కారుపై అన్నాడీఎంకే జెండా
  • 8న వెయ్యి కార్లతో చెన్నైకి
  • చిన్నమ్మ కారుపై అన్నాడీఎంకే జెండా.. తప్పుబట్టిన మంత్రి


బెంగళూరు, జనవరి 31(ఆంధ్రజ్యోతి): తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ కరోనా నుంచి కోలుకున్నారు. ఆదివారం బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రి నుంచి ఆమె బెంగళూరు శివారులోని దేవనహళ్లి ప్రిస్టేజ్‌ గోల్డ్‌షైర్‌ రిసార్టుకు చేరుకున్నారు. అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష పూర్తి చేసుకొని జనవరి 27న ఆమె విడుదలయ్యారు. జైల్లోనే కరోనా బారిన పడటంతో ఆస్పత్రిలో చేర్పించారు. కరోనా తగ్గడంతో వైద్యులు డిశ్చార్జ్‌ చేశారు. మరో వారం రోజులు క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించడంతో బెంగళూరులోనే గడపాలని ఆమె నిర్ణయించుకున్నారు. కాగా, ఆస్పత్రి నుంచి రిసార్టుకు శశికళ ప్రయాణించిన కారుపై అన్నాడీఎంకే జెండా ఉండటం చర్చనీయాంశమైంది.




పార్టీలో ప్రాథమిక సభ్యత్వమైనా లేకుండా ఆమె ఆ జెండాను ఎలా ఉపయోగించుకుంటారని తమిళనాడు మత్స్యశాఖ మంత్రి డి.జయకుమార్‌ తప్పుబట్టారు. శశికళ మేనల్లుడు, అమ్మ మక్కల్‌ మున్నేత్ర కళగం(ఏఎంఎంకే) నేత టీటీవీ దినకరన్‌ దానిని సమర్థించారు. ఆమె ఇప్పటికీ అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శేనని గుర్తుచేశారు. అయితే, ఈ విషయం ప్రస్తుతం కోర్టులో ఉందన్నారు.   

Updated Date - 2021-02-01T06:51:02+05:30 IST