శశికళ చెన్నై పర్యటన వాయిదా.. హెలికాప్టర్ ద్వారా పూలు!

ABN , First Publish Date - 2021-02-05T16:57:40+05:30 IST

ముందుగా ప్రకటించినట్లుగా 7వ తేదీన కాకుండా 8వ తేదీన ఆమె చెన్నై వస్తారని..

శశికళ చెన్నై పర్యటన వాయిదా.. హెలికాప్టర్ ద్వారా పూలు!

చెన్నై : మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ చెన్నై వచ్చే తేదీ మరోమారు వాయిదాపడింది. ముందుగా ప్రకటించినట్లుగా 7వ తేదీన కాకుండా 8వ తేదీన ఆమె చెన్నై వస్తారని శశికళ మేనల్లుడు, అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) నేత టీటీవీ దినకరన్‌ ప్రకటించారు. ఆమె 8వ తేదీ ఉదయం 9 గంటలకు దేవనహళ్లి నుంచి బయలు దేరుతారని వివరించారు. ఇదిలా వుండగా శశికళ వచ్చే మార్గంలో హెలికాప్టర్‌ ద్వారా పూలు చల్లేందుకు అనుమతించాలని కోరుతూ ఏఎంఎంకే నేతలు వేలూరు జిల్లా కలెక్టర్‌ను గురువారం వినతిపత్రం సమర్పించారు. కాగా, 8వ తేదీన తిరువళ్లూర్‌ జిల్లా పూందమల్లి సమీపంలో సీఎం పళనిస్వామి ఎన్నికల ప్రచారం చేపట్టనుండడం వల్లనే శశికళ తన ప్రయాణం వాయిదా వేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.


శశికళపై డీజీపీకి ఫిర్యాదు

శశికళ అన్నాడీఎంకే జెండాను వినియోగించడాన్ని అడ్డుకోవాలని కోరుతూ రాష్ట్ర మంత్రులు, పార్టీ సీనియర్‌ నేతలు గురువారం డీజీపీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈనెల 31వ తేదీ విక్టోరియా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన శశికళ.. మాజీ ముఖ్యమంత్రి జయలలిత కారుపై అన్నాడీఎంకే పతాకం ఏర్పాటు చేసి మరీ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈ నెల 8వ తేదీ బెంగుళూరు నుంచి చెన్నై వచ్చేటప్పుడు కూడా అన్నాడీఎంకే జెండాను వినియోగించే అవకాశ ముందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, గురువారం అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రిసీడియం ఛైర్మన్‌ ఇ.మధుసూధన్‌, మంత్రులు, జయకుమార్‌, తంగమణి, వేలుమణి, సీవీ షణ్ముగం సహా సీనియర్‌ నేతలు సమావేశమయ్యారు. అనంతరం అందరూ కలిసి డీజీపీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.

Updated Date - 2021-02-05T16:57:40+05:30 IST