ఆర్యన్ ఖాన్ కేసు దర్యాప్తు నుంచి వాంఖడే తొలగింపు

ABN , First Publish Date - 2021-11-06T02:14:30+05:30 IST

బాలీవుడ్ స్టార్‌హీరో షారూక్‌ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసు మరో..

ఆర్యన్ ఖాన్ కేసు దర్యాప్తు నుంచి వాంఖడే తొలగింపు

న్యూఢిల్లీ: బాలీవుడ్ స్టార్‌హీరో షారూక్‌ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసు మరో మలుపు తిరిగింది. కేసు ఇన్వెస్టిగేషన్‌ ముంబై జోన్ ఎన్‌సీబీ నుంచి ఎన్‌సీబీ సెంట్రల్ టీమ్‌కు బదిలీ అయింది. కేసు దర్యాప్తు నుంచి ఎన్‌సీబీ ముంబై యూనిట్ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేను తొలగించారు. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ మేనల్లుడు సమీర్‌ ఖాన్ కేసుతో సహా మరో ఐదు కేసులను సైతం ఎన్‌సీబీ సెంట్రల్ జోన్‌కు బదిలీ చేశారు. ఈ మొత్తం ఐదు కేసులకు ఎన్‌సీబీ సెంట్రల్ యూనిట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్ సింగ్ పర్యవేక్షణా అధికారిగా వ్యవహరించనున్నారు.


కాగా, ఈ కేసులకు దేశీయ, అంతర్జాతీయ కనెక్షన్లు ఉన్నందున ఇతర ఏజెన్సీలతో సమన్వయం అవసరమని, ఆ కారణంగానే కేసుల బదిలీ జరిగినట్టు ఏజెన్సీ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీలోని ఎన్‌సీబీ ప్రధాన కార్యాలయానికి కేసులు బదిలీ అయినప్పటికీ సమీర్ వాంఖడే మాత్రం ఎన్‌సీబీ ముంబై యూనిట్ జోనల్ అధికారిగా కొనసాగుతారు.


వాంఖడే వివరణ...

తాజా పరిణామంపై వాంఖడే మాట్లాడుతూ, విచారణ నుంచి తనను తొలగించలేదని చెప్పారు. సెంట్రల్ ఏజెన్సీతో దర్యాప్తు జరిపించాలని కోర్టులో తన రిట్ పిటిషన్ ఉందని, ఆ కారణంగానే ఆర్యన్, సమీర్ ఖాన్ కేసులను ఢిల్లీ ఎన్‌సీబీ సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) దర్యాప్తు చేయనుందని చెప్పారు. ఎన్‌సీబీ ఢిల్లీ, ముంబై టీమ్‌ల మధ్య సమన్వయంగా ఈ పరిణామాన్ని ఆయన విశ్లేషించారు. కాగా, ఇది పాలనాపరమైన నిర్ణయంగా సౌత్-వెస్ట్ రీజియన్ ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ముత్తా అశోక్ జైన్ తెలిపారు.


ఇది ఆరంభం మాత్రమే: నవాబ్ మాలిక్

కాగా, వాంఖెడేకు ఉద్వాసనపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఒక ట్వీట్‌లో స్పందించారు. ఇది ఆరంభం మాత్రమేనని, వ్యవస్థ ప్రక్షాళనకు చాలా చేయాల్సి వస్తుందని, తాము ఆ పని చేస్తామని అన్నారు. ''ఆర్యన్ ఖాన్ కేసుతో సహా ఐదు కేసుల నుంచి సమీర్ వాంఖడేకు ఉద్వాసన చెప్పారు. మొత్తంగా 26 కేసుల దర్యాప్తు జరగాల్సి ఉంది'' అని ఆ ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2021-11-06T02:14:30+05:30 IST