ప్రమాదంలో చిత్తూరువాసి

ABN , First Publish Date - 2021-12-09T08:17:16+05:30 IST

తమిళనాడులో బుధవారం జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదం మన రాష్ట్రాన్నీ విషాదంలో ముంచింది.

ప్రమాదంలో చిత్తూరువాసి

  • రావత్‌కు సెక్యూరిటీ అధికారిగా సాయితేజ విధులు
  • స్వగ్రామం ఎగువరేగడలో విషాదఛాయలు
  • చివరిసారిగా చవితికి సొంతూరుకు..
  • సోదరుడు మహేశ్‌ కూడా సైనిక జవానే.


కురబలకోట, డిసెంబరు 8: తమిళనాడులో బుధవారం జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదం మన రాష్ట్రాన్నీ విషాదంలో ముంచింది. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌కు వ్యక్తిగత సెక్యూరిటీ అధికారిగా పనిచేస్తున్న బొగ్గ్గుల సాయితేజ(27) ఈ ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.  సాయితేజది చిత్తూరు జిల్లా యర్రబలి పంచాయతీ ఎగువరేగడ గ్రామం. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన 2013లో ఆర్మీకి ఎంపికయ్యారు. మొదట సిపాయిగా విధులు నిర్వహించారు. అనంతరం అప్రెంటీస్‌ కోర్సు పూర్తిచేసి రక్షణశాఖలో లాన్స్‌ నాయక్‌గా విధుల్లో చేరారు. ఈ క్రమంలో సాయుతేజ చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌(సీడీఎస్‌) జనరల్‌ రావత్‌కు వ్యక్తిగత సెక్యూరిటీ అధికారిగా నియమితులయ్యారు. సాయితేజకు భార్య శ్యామల, కుమారుడు మోక్షజ్ఞ(5), కుమార్తె దర్శిని(2) ఉన్నారు. పిల్లల చదువుకోసం ఆరునెలల క్రితం మదనపల్లెకు నివాసం మార్చారు. చివరిసారిగా వినాయక చవితికి స్వగ్రామం ఎగువ రేగడకు వచ్చినట్లు కుటుంబీకులు తెలిపారు. సాయితేజ సోదరుడు మహేశ్‌బాబు కూడా జవానే. ప్రస్తుతం మహేశ్‌ సిక్కింలో పనిచేస్తున్నారు. సాయితేజ మరణవార్త తెలిసే సమయానికి తల్లిదండ్రులు పొలం పనుల్లో మునిగిఉన్నారు. ఫోన్‌ద్వారా ఆర్మీ అధికారులు వారికి సమాచారం ఇచ్చారు. విషయం తెలియగానే తల్లిదండ్రులు పొలంలోనే దుఖఃంతో కుప్పకూలిపోయారు. 

Updated Date - 2021-12-09T08:17:16+05:30 IST