ఆర్టీపీసీఆర్’ కోసం బుకింగ్ చేసుకోండి
ABN , First Publish Date - 2021-12-15T06:58:06+05:30 IST
ఒమైక్రాన్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు పౌర విమానయాన శాఖ(ఎంవోసీఏ) మరో సూచన చేసింది. ..

ఆ ఆరు విమానాశ్రయాల్లో తప్పనిసరి: కేంద్రం
న్యూఢిల్లీ, డిసెంబరు 14 : ఒమైక్రాన్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు పౌర విమానయాన శాఖ(ఎంవోసీఏ) మరో సూచన చేసింది. ఒమైక్రాన్ ముప్పు ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే వారు, లేదా గత 14 రోజుల్లో ఆ దేశాల్లో పర్యటించిన వారు ముందస్తుగా ఆర్టీపీసీఆర్ టెస్టు కోసం బుకింగ్ చేసుకోవాలని చెప్పింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ విమానాశ్రయాల్లో దిగే అం తర్జాతీయ ప్రయాణికులు తప్పనిసరిగా కరోనా టెస్టు కోసం ముందస్తు బుకింగ్ చేసుకోవాలని పేర్కొంది. ఈ నెల 20 నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుందని తెలిపింది. సంబంధిత విమానాశ్రయ వెబ్‌సైట్ ఎయిర్ సువిధ పోర్టల్‌లో ప్రయాణికులు వివరాలు నమోదు చేసుకుని టెస్టు కోసం బుకింగ్ చేసుకోవాలని కేంద్రం కోరింది. అయితే, ఈ పరీక్ష కోసం నమోదు చేసుకోని వారినీ ప్రయాణానికి అనుమతించాలని విమానయాన సంస్థలకు కేంద్రం సూచించింది. అలాంటి ప్రయాణికులను విమానాశ్రయంలోని పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లేందుకు సహకరించాలని చెప్పింది.