150 లక్షల మెట్రిక్‌ టన్నుల..బియ్యాన్ని సేకరించండి

ABN , First Publish Date - 2021-11-23T08:16:45+05:30 IST

150 లక్షల మెట్రిక్‌ టన్నుల..బియ్యాన్ని సేకరించండి

150 లక్షల మెట్రిక్‌ టన్నుల..బియ్యాన్ని సేకరించండి

వానాకాలం, యాసంగి సీజన్లకు టార్గెట్‌ ఇవ్వండి

కేంద్ర ఆహార శాఖ కార్యదర్శికి సీఎస్‌ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): తెలంగాణ నుంచి వానాకాలం, యాసంగి వ్యవసాయ సీజన్లకు సంబంధించి మొత్తం 150 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సేకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ కేంద్రాన్ని కోరారు. రెండు సీజన్లలో బియ్యం సేకరణకు టార్గెట్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) తెలంగాణ నుంచి బియ్యం సేకరించే అంశంపై చర్చించేందుకు సీఎం కేసీఆర్‌, మంత్రులతో పాటు ఢిల్లీ వచ్చిన సోమేశ్‌కుమార్‌, అధికారుల బృందం సోమవారం ఢిల్లీలోని కృషి భవన్‌లో కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండేను కలిసింది. అరగంటపైగా సాగిన ఈ భేటీలో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి, రైతుల ఇబ్బందుల గురించి వివరించారు. వానాకాలం   వరి ధాన్యం మార్కెట్‌లోకి వస్తోందని, కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. అయితే, కేంద్రం నుంచి స్పష్టత లేకపోవడంతో కొనుగోళ్లపై సందిగ్ధం నెలకొందన్నారు. మరోవైపు గత యాసంగి సీజన్‌కు సంబంధించి మిగిలిన పారాబాయిల్డ్‌ బియ్యాన్ని కూడా కొనుగోలు చేయాలని కోరినట్లు అధికార వర్గాలు చెప్పాయి. ఈ సందర్భంగా గత ఏడాది బియ్యం సేకరణ గణాంకాలను పరిశీలించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాగా, రాష్ట్ర అధికారుల వినతులపై సుధాన్షు పాండే స్పష్టమైన హామీ ఇవ్వలేదని సమాచారం

Updated Date - 2021-11-23T08:16:45+05:30 IST