విభజిత ఉభయ రాష్ట్రాల్లోఎక్కడైనా రిజర్వేషన్‌ పొందవచ్చు

ABN , First Publish Date - 2021-08-21T07:47:31+05:30 IST

ఉమ్మడి రాష్ట్రంలో రిజర్వేషన్‌ సౌకర్యం కలిగిన వ్యక్తి, విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో

విభజిత ఉభయ రాష్ట్రాల్లోఎక్కడైనా రిజర్వేషన్‌ పొందవచ్చు

 జార్ఖండ్‌ వ్యక్తి వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు

న్యూఢిల్లీ, ఆగస్టు 20: ఉమ్మడి రాష్ట్రంలో రిజర్వేషన్‌ సౌకర్యం కలిగిన వ్యక్తి, విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఆ హక్కు ఉపయోగించుకోవచ్చునని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే, రిజర్వేషన్‌ పరిధిలోకి వచ్చి, విభజనకు గురైన రెండు రాష్ట్రాల్లోనూ ఆ సౌకర్యం పొందటానికి వీల్లేదని స్పష్టంచేసింది. జార్ఖండ్‌కు చెందిన పంకజ్‌ కుమార్‌ అనే ఎస్సీ అభ్యర్థి దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్‌ యు.యు. లలిత్‌, జస్టిస్‌ అజయ్‌ రో స్తోగీలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.


బిహార్‌ నుంచి వేరయి 2000 నవంబరులో ప్రత్యేక రాష్ట్రంగా జార్ఖండ్‌  ఏర్పడింది. పంకజ్‌ కుమార్‌ బిహార్‌లోని పట్నాలో ఉంటూ, జార్ఖండ్‌ రాష్ట్ర సివిల్‌ సర్వీసులకు 2007 నవంబరులో ఎంపికయ్యారు. స్థానికేతరుడు అనే కారణంగా ఆయన నియామకా న్ని జార్ఖండ్‌ హైకోర్టులోని ముగ్గురు న్యాయమూర్తులు 2:1 నిష్పత్తిలో 2007 లో కొట్టివేశారు. దీనిపై ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం శుక్రవారం కొన్ని కీలక వ్యాఖ్య లు చేసింది.


‘‘విభజిత బిహార్‌లో నివాసముండే వ్యక్తి.. మరో విభజిత జార్ఖండ్‌లో సాధారణ నియామక (ఓపెన్‌ సెలెక్షన్‌) పద్ధతిలో జరిగిన ఉద్యోగ పరీక్షలకు హాజరయితే...వలసదారుగా గుర్తించి, జనరల్‌ కేటగిరీలో అతనికి అవకాశం కల్పించాలి. రిజర్వేషన్‌ కేటగిరీ పరిధిలోకి ఒకవేళ వచ్చినా, ఈ సందర్భంలో మాత్రం ఆ హక్కు అతడు ఉపయోగించుకోవడానికి వీలు ఉండదు’’ అని ధర్మాసనం వివరించింది.


హైకోర్టు తీర్పు అసమగ్రంగా ఉందంటూ, దానిని పక్కనపెట్టింది. మెజారిటీ అభిప్రాయానికి భిన్నంగా వేరుగా తీర్పురాసిన హైకోర్టు జడ్జి అభిప్రాయాలతోనూ తాము విభేదిస్తున్నామని బెంచ్‌ తెలిపింది. రిజర్వేషన్‌ హక్కును విభజిత రెండు రాష్ట్రాల్లోనూ వినియోగించుకోవచ్చుననే ఆ జడ్జి తీర్పు, రాజ్యాంగంలోని 341(1), 342(1) స్ఫూర్తికి భంగకరమని వ్యాఖ్యానించింది. పంకజ్‌కుమార్‌ను వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని ఆదేశించింది. 2007లో నియమిస్తే ఇప్పటికే 14 ఏళ్ల సర్వీసు పూర్తయ్యేదని తెలిపింది. కాబట్టి, పంకజ్‌ సీనియారిటీని గుర్తిస్తూ.. ఈ కాలాన్నంతా లెక్కించి తగిన వేతనం, అలవెన్స్‌లు ఖరారుచేయాలని స్పష్టం చేసింది. 


Updated Date - 2021-08-21T07:47:31+05:30 IST