ఇప్పుడేమంటారు మంత్రిగారూ!
ABN , First Publish Date - 2021-03-21T07:05:35+05:30 IST
రాసలీలల సీడీ నకిలీదని, సదరు యువతి ఎవరో కూడా తెలియదని పేర్కొన్న మాజీ మంత్రి రమేశ్‌జార్కిహొళి.. ‘సిట్’ అధికారుల ప్రశ్నలకు ఖంగుతిన్నట్లు సమాచారం. ఈ కేసు విచారణలో భాగంగా శనివారం సీఐడీ

- సిట్ ప్రశ్నలతో ఖంగుతిన్న రమేశ్ జార్కిహొళి
- కోర్టుకు హాజరైన యువతి బాయ్‌ఫ్రెండ్
- ఆమెకు వ్యతిరేకంగా కీలక సమాచారం వెల్లడి
బెంగళూరు, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): రాసలీలల సీడీ నకిలీదని, సదరు యువతి ఎవరో కూడా తెలియదని పేర్కొన్న మాజీ మంత్రి రమేశ్‌జార్కిహొళి.. ‘సిట్’ అధికారుల ప్రశ్నలకు ఖంగుతిన్నట్లు సమాచారం. ఈ కేసు విచారణలో భాగంగా శనివారం సీఐడీ కేంద్ర కార్యాలయంలోని సిట్ ముందు రమేశ్‌జార్కిహొళి హాజరయ్యారు. అధికారులు 4 గంటలపాటు ఆయనను ప్రశ్నలతో బెంబేలెత్తించారు. యువతితో 10 నిమిషాలపాటు జార్కిహొళి మాట్లాడిన రికార్డులను అధికారులు ఆయనకే వినిపించినట్లు సమాచారం. కాగా సీఎం యడియూరప్పతో రమేశ్ సోదరుడు, బాలచంద్ర ఉదయం భేటీ అయ్యారు. కోర్ కమిటీలో రమేశ్‌కు అనుకూలంగా వ్యవహరించాలని కోరినట్లు తెలుస్తోంది. కాగా.. రాసలీలల సీడీ యువతి బాయ్‌ఫ్రెండ్ ఆకాశ్ తళవాడ న్యాయమూర్తికి కీలక సమాచారాన్ని అందించారు.
సదరు యువతిని ప్రేమించి, ఆమె తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యానని తెలిపారు. కానీ ఆమె.. నాలుగు నెలలుగా ప్రస్తుత కేసులో అనుమానితులతో కలిసి పథకం రూపొందించిదంటూ ఆర్‌టీ నగర్‌లో జరిగిన వీరి సమావేశాల సమాచారాన్ని న్యాయమూర్తికి సమగ్రంగా వివరించినట్లు తెలుస్తోంది. సీడీ రూపకల్పనలో భాగస్వామ్యులైనవారు నగదు పంపిణీ చేసుకున్నారని తెలిపినట్లు సమాచారం. సీడీ విడుదలకు ముందు ఆమెతో కలసి గోవా వెళ్లానని, సీడీ విడుదలయ్యాక సంచలనం కావడంతో ఆమె తిరిగి బెంగళూరు వచ్చిందని తెలిపాడు. ఆ తర్వాత సదరు గ్యాంగ్‌తో కలసి వెళ్లిందని, ఆమె ఎక్కడ ఉందనేది తనకు తెలియదని చెప్పాడు. కాగా సదరు యువతికి డబ్బు సమకూర్చిన పారిశ్రామికవేత్త శివకుమార్ నివాసంపై సిట్ అధికారులు దాడి చేశారు. మరోవైపు శనివారం బెళగావికి ఓ బృందం వెళ్లింది. రాసలీలల సీడీ అంశం వెలుగులోకి వచ్చాక బెళగావిలో గోకాక్ సాహుకార్ పేరిట కథనాలు ప్రసారం చేసిన మేరకు ఆరు చానళ్లపై జార్కిహొళి తరపు న్యాయవాది నోటీసులు ఇచ్చారు.