అస్సాం గౌరవాన్ని కాపాడతాం : రాజ్‌నాథ్ సింగ్

ABN , First Publish Date - 2021-03-14T22:25:22+05:30 IST

అస్సాం గౌరవ, మర్యాదలను ప్రభుత్వం కాపాడుతుందని రక్షణ మంత్రి

అస్సాం గౌరవాన్ని కాపాడతాం : రాజ్‌నాథ్ సింగ్

బిశ్వనాథ్ : అస్సాం గౌరవ, మర్యాదలను ప్రభుత్వం కాపాడుతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. భూపేన్ హజారికాను ‘భారత రత్న’తో గౌరవించడం రాష్ట్రం పట్ల తమకుగల గౌరవానికి నిదర్శనమని తెలిపారు. శాసన సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ఆదివారం ఆయన  బిశ్వనాథ్‌లో జరిగిన ప్రచార సభలో మాట్లాడారు. 


అస్సాం గడ్డ గౌరవాన్ని కాపాడటానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. సంగీత సామ్రాజ్య చక్రవర్తి భూపేన్ హజారికాకు ‘భారత రత్న’ పురస్కారాన్ని ప్రదానం చేయడానికి కారణం అదేనని, అస్సాం పట్ల తమకుగల గౌరవానికి ఇది నిదర్శనమని తెలిపారు. అసోం అనే పదం నుంచి వచ్చిన అస్సాం రాష్ట్రం అత్యంత విశిష్టమైనదని చెప్పారు. కామాఖ్య దేవి, బ్రహ్మపుత్ర నది ఉన్న పవిత్ర భూమి అని చెప్పారు. లచిత్ బోర్ఫుకన్ గడ్డపై అడుగు పెట్టడం తనకు గర్వకారణమని తెలిపారు. పుణే సమీపంలోని ఖడక్‌వస్లాలో ఉన్న నేషనల్ డిఫెన్స్ అకాడమీలో సైన్యంలో చేరే ఉత్తమ క్యాడెట్‌కు బోర్ఫుకన్ ట్రోఫీ ఇస్తారన్న విషయం కొద్ది మందికి మాత్రమే తెలుసునని చెప్పారు. 


126 స్థానాలున్న అస్సాం శాసన సభ ఎన్నికలు మార్చి 27 నుంచి మూడు దశల్లో జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మే 2న జరుగుతుంది. 


Updated Date - 2021-03-14T22:25:22+05:30 IST