చెన్నై తిరిగొచ్చిన రజనీకాంత్

ABN , First Publish Date - 2021-10-28T15:39:45+05:30 IST

దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మంగళవారం రాత్రి పొద్దుపోయాక నగరానికి చేరుకున్నారు. ప్రతిష్ఠాత్మక అవార్డు స్వీకరించి నగరానికి తిరిగొచ్చిన తలైవర్‌ కు ఆయన అభిమానులు విమానాశ్రయం

చెన్నై తిరిగొచ్చిన రజనీకాంత్

              - విమానాశ్రయంలో అభిమానుల ఘనస్వాగతం


చెన్నై(Chennai): దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మంగళవారం రాత్రి పొద్దుపోయాక నగరానికి చేరుకున్నారు. ప్రతిష్ఠాత్మక అవార్డు స్వీకరించి నగరానికి తిరిగొచ్చిన తలైవర్‌ కు ఆయన అభిమానులు విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. భారత సినీరంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును రెండు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా రజనీకాంత్‌ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తనను అమితంగా అభిమానించే తమిళ ప్రజలకు, తన సినీగురువు కె.బాలచందర్‌ కు ఈ పురస్కారం అంకితమిస్తున్నట్టు రజనీకాంత్‌ ప్రకటించారు. కుటుంబసభ్యులతో కలసి ఢిల్లీ వెళ్లి పురస్కారం అందుకున్న రజనీ.. ఆ తరువాత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను, ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకుని కృతజ్ఞత తెలిపారు. మంగళవారం సాయంత్రం రజనీ దంపతులు ప్రధాని నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. వారిద్దరి తోనూ ప్రధాని ఎంతో స్నేహపూర్వకంగా మాట్లాడి అభినందించారు. ఇందుకు రజనీ సైతం ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రత్యేక విమానంలో మంగళవారం రాత్రి 11.50 గంటలకు చెన్నై విమానాశ్రయం చేరుకున్నారు. భార్య లత రజనీకాంత్‌, కుమార్తె సౌందర్య, మనుమళ్లతో తిరిగొచ్చిన రజనీకాంత్‌కు అభిమానులు శాలువ కప్పి ఘనస్వాగతం పలి కారు. అనంతరం ఆయన ట్విట్టర్‌లో, తనను మనస్పూర్తిగా అభినందించిన రాజకీయనేతలు, ప్రభుత్వ అధికారులు, అన్ని రంగాలకు చెందిన స్నేహితులు, అభిమానులు, ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు ప్రకటించారు.

Updated Date - 2021-10-28T15:39:45+05:30 IST