రాజేంద్రబాలాజీ బ్యాంక్‌ ఖాతాల స్తంభన

ABN , First Publish Date - 2021-12-26T13:46:18+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగాలు తీసిస్తానంటూ పలువురి వద్ద కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసగించిన కేసుల్లో పరారీలో ఉన్న అన్నాడీఎంకే మాజీ మంత్రి రాజేంద్రబాలాజీ బ్యాంకు ఖాతాలను పోలీసులు స్తంభింపజేశారు. ఆవిన్‌

రాజేంద్రబాలాజీ బ్యాంక్‌ ఖాతాల స్తంభన

చెన్నై: ప్రభుత్వ ఉద్యోగాలు తీసిస్తానంటూ పలువురి వద్ద కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసగించిన కేసుల్లో పరారీలో  ఉన్న అన్నాడీఎంకే మాజీ మంత్రి రాజేంద్రబాలాజీ బ్యాంకు ఖాతాలను పోలీసులు స్తంభింపజేశారు. ఆవిన్‌ సంస్థ సహా ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాలు తీసిస్తానంటూ రాజేంద్ర బాలాజీ మూడుకోట్లకు పైగా వసూలు చేసి మోసగించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టు కాకుండా వుండేందుకు ఆయన బెయిలు కోసం తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. మద్రాసు హైకోర్టులో ఆయన బెయిలు పిటిషన్‌ తోసివేతకు గురికావటంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పదిరోజులకు పైగా పోలీసుల కంటపడకుండా అజ్ఞాతంలో ఉన్న రాజేంద్రబాలాజీ విదేశాలకు పారిపోయే అవకాశం వుండటంతో సెంట్రల్‌ క్రైం విభాగం పోలీసులు అన్ని విమానాశ్రయాలకు లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు. రాజేంద్రబాలాజీ పరారీలో ఉన్న నేరస్థుడంటూ ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇదేవిధంగా ఆయన కడలిమార్గంలో పారిపోకుండా ఉండేందుకుగాను పోలీసులు అన్ని హార్బర్ల ఉన్నతాధికారులకు కూడా రాజేంద్రబాలాజీ పరారీ గురించిన సమాచారాన్ని అందించారు. తాజాగా విరుదునగర్‌ జిల్లాలో రాజేంద్ర బాలాజీపై తాజాగా మరో మోసం కేసు నమోదైంది. ఈ పరిస్థితుల్లో రాజేంద్రబాలాజీకి చెందిన ఆరు బ్యాంకు ఖాతాలను క్రైం విభాగం పోలీసులు స్తంభింపజేశారు. ఇదిలా వుండగా ఆయన హోసూరు, బెంగళూరు నగరాలలో దాగి ఉన్నట్టు సమాచారం అందటంతో ప్రత్యేక దళం పోలీసులు ఆ రెండు నగరాలలో తీవ్రగాలింపు చర్యలు చేపడతున్నారు. రాజేంద్ర బాలాజీ సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌పై కూడా పోలీసులు నిఘా వేస్తున్నారు.

Updated Date - 2021-12-26T13:46:18+05:30 IST