అక్రమాస్తుల కేసు విచారణను నిలిపేయండి

ABN , First Publish Date - 2021-08-20T16:10:51+05:30 IST

తన అక్రమాస్తులపై జరుగుతున్న విచారణను అడ్డుకోవాలని అభ్యర్థిస్తూ అన్నాడీఎంకే సీనియర్‌నేత, పాడిపరిశ్రమశాఖ మాజీ మంత్రి రాజేంద్రబాలాజీ సుప్రీంకోర్టు తలు

అక్రమాస్తుల కేసు విచారణను నిలిపేయండి

                 - ‘సుప్రీం’ తలుపుతట్టిన రాజేంద్ర బాలాజీ


పెరంబూర్‌(చెన్నై): తన అక్రమాస్తులపై జరుగుతున్న విచారణను అడ్డుకోవాలని అభ్యర్థిస్తూ అన్నాడీఎంకే సీనియర్‌నేత, పాడిపరిశ్రమశాఖ మాజీ మంత్రి రాజేంద్రబాలాజీ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఈ మేరకు ఆయన సుప్రీంకోర్టులో అప్పీలు పిటిషన్‌ దాఖలు చేశారు. వివరాల్లోకి వెళితే... రాజేంద్ర బాలాజీ గత 2011 నుంచి 2013 వరకు ఆదాయానికి మించిన ఆస్తులు కలవున్నారని, ఆయనపై చర్యలు చేపట్టాలని కోరుతూ హైకోర్టు మదురై డివిజన్‌ బెంచ్‌లో తల్లాకుళంకు చెందిన మహేంద్రన్‌ 2013లో పిటిషన్‌ దాఖలు చేశారు. రాజపాళయం సమీపం దేవదానంలో రూ.74 లక్షలతో 35 ఎకరాల స్థలం, తిరుత్తంగల్‌లో రూ.23 లక్షలతో ఇల్లు, రూ.4 లక్షలతో స్థలం కొనుగోలు చేశారని, కానీ, బహిరంగ మార్కెట్‌లో వాటి విలువ కోట్లలో వుంటుందని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఈ స్థలాల కొనుగోలు ద్వారా మంత్రి రూ.7 కోట్ల మేర అదనపు ఆస్తులు కలిగివున్నారని, ఈ విషయమై అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు. గతంలో మద్రాసు హైకోర్టులో ఈ కేసు విచారణకు రాగా, రాజేంద్ర బాలాజీ మంత్రిపదవిని దుర్వినియోగం చేయలేదని, అక్రమాస్తులు కూడబెట్టుకున్నారన్న ఫిర్యాదులో వాస్తవం లేనందున, ఆయనపై చర్యలు తీసుకోలేరంటూ ప్రజాపనులశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని అవినీతి నిరోధకశాఖ కోర్టుకు వివరించింది. దీంతో, గత ఏప్రిల్‌ 3వ తేదీన హైకోర్టు మదురై ధర్మాసనంలోని న్యాయమూర్తులు ఎం.సత్యనారాయణన్‌, ఆర్‌.హేమలత వేర్వేరు తీర్పులు వెలువరించారు. అక్రమంగా ఆస్తులు కూడబెట్టారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజేంద్ర బాలాజీపై అవినీతి నిరోధకశాఖ కేసు నమోదుచేసి విచారణ చేపట్టాలని న్యాయమూర్తి సత్యనారాయణ తీర్పునివ్వగా, ఆలస్యంగా ఫిర్యాదు వచ్చినందున ఈ వ్యవహారంపై విచారణ జరిపినా ఎలాంటి ప్రయోజనం వుండదని పేర్కొంటూ కేసును ముగిస్తున్నట్టు న్యాయమూర్తి హేమలత స్పష్టం చేశారు. ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు తీర్పులివ్వడంతో ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టే ధర్మాసనంలోకి మూడవ న్యాయమూర్తి ఎం.నిర్మల్‌కుమార్‌ను నియమిస్తూ ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాజేంద్రబాలాజీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్రాస్‌ హైకోర్టు హడావుడిగా విచారణ చేపట్టిందని ఆయన దాఖలు చేసిన అప్పీలు పిటిషన్‌లో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా, ప్రజాపనులశాఖ నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే ధర్మాసనంలో ఒక న్యాయమూర్తి తీర్పు వెలువరించారని వివరించారు. ఇప్పుడు తనపై దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు మూడవ న్యాయమూర్తిని కూడా నియమించారని పేర్కొన్నారు. అందువల్ల హైకోర్టు నిర్ణయాన్ని రద్దు చేయడంతో పాటు, తనపై చేపట్టదలచిన విచారణపై స్టే విధించాలని అభ్యర్థించారు. 

Updated Date - 2021-08-20T16:10:51+05:30 IST