రాహుల్ గాంధీ నిష్ప్రయోజకుడు : కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2021-08-21T21:40:09+05:30 IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎవరికీ ఉపయోగపడే వ్యక్తి కాదని, ఆయన

రాహుల్ గాంధీ నిష్ప్రయోజకుడు : కేంద్ర మంత్రి

ముంబై : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎవరికీ ఉపయోగపడే వ్యక్తి కాదని, ఆయన ఆంబోతు వంటివారని రైల్వే శాఖ సహాయ మంత్రి రావు సాహెబ్ దన్వే ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ తీవ్రంగా విరుచుకుపడింది. రావు సాహెబ్ అమర్యాదకరంగా, దిగ్భ్రాంతికరంగా మాట్లాడారని, కేంద్ర మంత్రి పదవి నుంచి ఆయనను తొలగించాలని డిమాండ్ చేసింది. 


మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో జన ఆశీర్వాద యాత్రలో పాల్గొన్న దన్వే శనివారం మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ఆంబోతువంటివారని, ఆయన వల్ల ఎవరికీ ప్రయోజనం లేదని అన్నారు. ఆయన అన్ని చోట్లకు తిరుగుతూ ఉంటారని, అయినా ప్రయోజనం ఏమీ ఉండదని అన్నారు. తాను ఇరవయ్యేళ్ళ నుంచి లోక్‌సభలో ఉన్నానని, రాహుల్ పనితీరును గమనించానని చెప్పారు. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న గొప్ప కృషిని అందరూ పరిశీలించాలని కోరారు. రైల్వేలకు తగినంత ఆదాయం రావడం లేదని, ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేయవలసి వస్తోందని చెప్పారు. 


కేంద్ర మంత్రి దన్వే వ్యాఖ్యలపై మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దన్వే అన్ని రకాల హద్దులను దాటిపోయారన్నారు. ఆయన వ్యాఖ్యలు అమర్యాదకరంగా, దిగ్భ్రాంతికరంగా ఉన్నాయన్నారు. ఇటువంటి భాషను ఉపయోగించినందుకు ఆయనను వెంటనే కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. 


Updated Date - 2021-08-21T21:40:09+05:30 IST