విదేశీ సాయంపై పారదర్శకత ఏది?: కేంద్రంపై రాహుల్ ఫైర్..

ABN , First Publish Date - 2021-05-06T01:44:07+05:30 IST

కరోనా మహమ్మారిపై పోరాడుతున్న భారత్‌కు విదేశాల నుంచి అందిన సాయంపై ‘‘పారదర్శకత’’ లేదంటూ కాంగ్రెస్ నేత రాహుల్....

విదేశీ సాయంపై పారదర్శకత ఏది?: కేంద్రంపై రాహుల్ ఫైర్..

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాడుతున్న భారత్‌కు విదేశాల నుంచి అందిన సాయంపై ‘‘పారదర్శకత’’ లేదంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. విదేశీ సాయంపై కేంద్రం జవాబు చెప్పాలంటూ ట్విటర్ వేదికగా ప్రశ్నలు సంధించారు. ‘‘భారత్‌ అందుకున్న మొత్తం సరఫరాలు ఏమిటి? అవన్ని ఎక్కడ ఉన్నాయి? వాటి ద్వారా లబ్ధి పొందుతున్నది ఎవరు? వాటిని రాష్ట్రాలకు ఎలా కేటాయించారు? ఇందులో పారదర్శకత ఎందుకు పాటించడం లేదు? దీనికి భారత ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా?’’ అంటూ రాహుల్ ప్రశ్నల వర్షం కురిపించారు. విదేశాల నుంచి భారత్‌కు అందిన కొవిడ్ సాయంపై పారదర్శకత పాటించాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఎక్కడెక్కడి నుంచి ఎంత సాయం అందిందీ... వాటిని ప్రజలకు ఎలా అందించారనే దానిపై వివరాలను బహిర్గతం చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ‘‘వ్యాక్సిన్ లేదు.. ఉపాధి లేదు. ప్రజలంతా కరోనా వైరస్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది...’’ రాహుల్ ట్వీట్ చేశారు. ఒక్క ఏప్రిల్ మాసంలోనే 75 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారంటూ సెంటర్ ఆఫ్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) ఇటీవల వెల్లడించిన విషయాన్ని సైతం రాహుల్ ప్రస్తావించారు.  

Updated Date - 2021-05-06T01:44:07+05:30 IST