రాహుల్‌పై కర్ణాటక బీజేపీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-10-19T22:07:39+05:30 IST

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై కర్ణాటక బీజేపీ చీఫ్ నలిన్..

రాహుల్‌పై కర్ణాటక బీజేపీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు

బెంగళూరు: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై కర్ణాటక బీజేపీ చీఫ్ నలిన్ కుమార్ కటీల్ మంగళవారంనాడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. బీజేపీ తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.


''రాహుల్ గాంధీ ఎవరు? నేను చెప్పడం లేదు. రాహుల్ గాంధీ మాదక ద్రవ్యాల బానిస, మాదక ద్రవ్యాల విక్రేత. మీడియాలో ఆ విషయం వచ్చింది. మీకు (రాహుల్) కనీసం మీ పార్టీని నడపడం కూడా రాదు'' అంటూ కటీల్ వ్యాఖ్యానించారు. దీనికి ముందు, కర్ణాటక కాంగ్రెస్ ప్రధాన మోదీని నిరక్షరాస్యుడంటూ కన్నడంలో ట్వీట్ చేసింది. అయితే, ఆ వెంటనే మోదీపై వచ్చిన వివాదాస్పద ట్వీట్‌ను పార్టీ సోషల్ మీడియా టీమ్ తొలగించినట్టు డీకే శివకుమార్ ప్రకటించారు.


బీజేపీ క్షమాపణ చెప్పాలి: డీకే

కాగా, రాహుల్‌ గాంధీపై నలిన్ కుమార్ కటీల్ చేసిన వ్యాఖ్యలపై డీకే శివకుమార్ మంగళవారం సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించారు. బీజేపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ''నిన్ననే నేను ఒకమాట చెప్పాను. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉన్నప్పటికీ వారిపట్ల గౌరవప్రదంగా, నాగరికంగా వ్యవహరించాలని నేను బలంగా నమ్ముతాను. బీజేపీ కూడా ఈ విషయంలో ఏకీభవిస్తుందని అనుకుంటున్నాను. రాహుల్ గాంధీపై కటీల్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు బీజేపీ క్షమాపణ చెబుతుందనే అనుకుంటున్నాను'' అని డీకే శివకుమార్ ట్వీట్ చేశారు.


Updated Date - 2021-10-19T22:07:39+05:30 IST