నేడు సుప్రీం ముందుకు రఘురామరాజు కేసు
ABN , First Publish Date - 2021-05-21T08:30:26+05:30 IST
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత సంచలనం సృష్టిస్తోన్న నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్టు, తదనంతర పరిణామాలపై సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యాహ్నం కీలక విచారణ జరపనుంది.

ఎంపీ బెయిల్‌పై ప్రభుత్వ అఫిడవిట్.. విచారణపై న్యాయవర్గాల్లో ఉత్కంఠ
న్యూఢిల్లీ, మే 20 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత సంచలనం సృష్టిస్తోన్న నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్టు, తదనంతర పరిణామాలపై సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యాహ్నం కీలక విచారణ జరపనుంది. మధ్యాహ్నం 12 గంటలప్రాంతంలో జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బి.ఆర్. గవాయిలతో కూడిన ధర్మాసనం ఎదుట కేసు జాబితాలో 25 నంబర్ ఐటమ్‌గా ఈ కేసు విచారణకు రానుంది. రాజద్రోహం, తదితర కేసులను మోపి సీఐడీ అరెస్టు చేసిన రఘురామ కృష్ణం రాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేసి తమకు నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఈనెల 17వ తేదీన ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలమేరకు ఆర్మీ ఆస్పత్రి... రఘురామకృష్ణం రాజు వైద్యపరీక్షలకు సంబంధించి పంపిన నివేదిక ఇప్పటికే సుప్రీంకోర్టు బెంచ్ ముందుకు చేరుకుంది. కాగా, తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ రఘురామకృష్ణం రాజు వేసిన ఎస్‌ఎల్‌పీకి (స్పెషల్ లీవ్ పిటిషన్) కౌంటర్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ కూడా కోర్టు పరిశీలనలో ఉన్నది.
కాగా గత ఏడాది రఘురామరాజు గుండెకు సర్జరీ జరిగిందని, ఆయన శరీరంపై గాయాలు ఉన్నాయన్న వాస్తవాన్ని మెజిస్ర్టేట్ రికార్డు చే యడాన్ని ప్రాతిపదికగా తీసుకుని సుప్రీంకోర్టు ఆయన వైద్య పరీక్షకు ఆదేశించిన విషయంతెలిసిందే. ఆర్మీ ఆస్పత్రి నియమించిన ముగ్గురు డాక్టర్ల బోర్డు...తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమించిన న్యాయాధికారి సమక్షంలో వైద్య పరీక్షలను నిర్వహించాలని, ఈ పరీక్షలను వీడియో ద్వారా చిత్రీకంచి నివేదికతోపాటు సీల్డు కవర్ లో తెలంగాణ హైకోర్టుకు సమర్పించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ ఆదేశాలనుబట్టి సుప్రీంకోర్టు రఘురామకృష్ణంరాజు పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై వచ్చిన ఆరోపణలను అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
రఘురామకృష్ణం రాజు తన ప్రసంగాల్లో ఎక్కడా హింసాకాండను రెచ్చగొట్టలేదని, ఇప్పటికే తన ప్రాణానికి ముప్పు ఉన్నదన్న భయంతో ఆయన వై సెక్యూరిటీ భద్రత పొందారని, ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి గత వారం సుప్రీంకోర్టు ముందు బలంగా వాదించారు. రఘురామకృష్ణంరాజు పిటిషన్‌కు జవాబిచ్చేందుకు ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది దుష్యంత్ దవే శుక్రవారం వరకు వాయిదా కోరారు. గురువారం ఈ మేరకు ఏపీ ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ లో తన చర్యను సమర్థించుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉన్నత న్యాయస్థానం ముందు జరిగే విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది.