భర్తను భార్య హత్యచేసినా ఫ్యామిలీ పింఛనుకు అర్హురాలే!
ABN , First Publish Date - 2021-02-01T06:55:55+05:30 IST
కట్టుకున్న భర్తను హత్య చేసినా ఆ భార్య ఫ్యామిలీ పెన్షన్‌కు అర్హురాలే అవుతుంది అని పంజాబ్, హరియాణా హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.

పంజాబ్, హరియాణా హైకోర్టు సంచలన తీర్పు
చండీగఢ్, జనవరి 31: కట్టుకున్న భర్తను హత్య చేసినా ఆ భార్య ఫ్యామిలీ పెన్షన్‌కు అర్హురాలే అవుతుంది అని పంజాబ్, హరియాణా హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. తర్సెమ్ సింగ్, బల్జీత్ కౌర్ దంపతులది హరియాణా. ప్రభుత్వ ఉద్యోగి అయిన తర్సెమ్ సింగ్ 2008లో మృతిచెందారు. ఆయన్ను భార్య బల్జీతే చంపారంటూ 2009లో కేసు నమోదైంది. 2011లో ఆమెను దోషిగా కోర్టు నిర్ధారించింది. భర్త మృతిచెందినప్పటి నుంచి 2011 దాకా బల్జీత్ కౌర్ ఫ్యామిలీ పెన్షన్‌ను పొందారు. భర్తను హత్యచేసిందని కోర్టు ద్వారా రుజువైన వెంటనే ఆమెకు అప్పటిదాకా వస్తున్న పెన్షన్‌ను ప్రభుత్వం నిలిపివేసింది.
దీనిపై ఆమె పంజాబ్, హరియాణా హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును జనవరి 25న విచారించిన ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. ‘భర్తను హత్యచేసిందనే కారణంతో ఫ్యామిలీ పెన్షన్‌కు భార్యను దూరం చేయరాదు. ప్రభుత్వ ఉద్యోగి మరణించినప్పుడు ఆ కుటుంబాన్ని ఆర్థికంగా సాయం చేసేందుకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకమే ఫ్యామిలీ పెన్షన్. భార్య క్రిమినల్ కేసులో దోషిగా తేలినా సరే ఫ్యామిలీ పెన్షన్‌కు ఆ మె అర్హురాలే అవుతుంది’ అని వ్యాఖ్యానించింది. బల్జీత్‌కు ఫ్యామిలీ పెన్షన్‌ను నిలిపివేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వును కొట్టివేసింది. ఆమెకు 2011 నుంచి రావాల్సి ఉన్న బకాయిలను రెండు నెలల్లోగా చెల్లించాలని పేర్కొంది.