రాత్రి కర్ఫ్యూ మరో గంట పొడిగింపు
ABN , First Publish Date - 2021-04-20T00:58:20+05:30 IST
కర్ఫ్యూ సమయాన్ని రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ పొడిగించాలని కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభుత్వం...
ఛండీగఢ్: పంజాబ్‌లో కోవిడ్ కేసుల అంతకంతకూ పెరుగుతుండటంతో నైట్ కర్ఫ్యూ సమయాన్ని మరో గంటసేపు పంజాబ్ సర్కార్ పొడిగించింది. కర్ఫ్యూ సమయాన్ని రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ పొడిగించాలని కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభుత్వం నిర్ణయించింది. అమరీందర్ సింగ్ అధ్యక్షతన సోమవారంనాడు జరిగిన ఉన్నత స్థాయి కోవిడ్ సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం రాత్రి నుంచి తాజా కర్ఫ్యూ సమయాలు అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ వేళలు అమల్లో ఉన్నాయి.
ఈనెల 20 నుంచి 30వ తేదీ వరకూ అన్ని బార్లు, సినిమా హాళ్లు, జిమ్‌లు, స్పాలు, కోచింగ్ సెంటర్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు మూసివేయాలని అమరీందర్ సింగ్ ఆదేశించారు. రెస్టారెంట్లు, హోటళ్లు తెరచే ఉంచుతారు. అయితే, సోమవారం నుంచి శనివారం వరకూ టేక్‌ఎవే, హోం డెలివరీని మాత్రమే అనుమతిస్తారు. కొత్త ఆంక్షల ప్రకారం, మాల్స్, షాపులు, మార్కెట్లు ఆదివారం మూసివేయాలి. వివాహాలు, అంత్యక్రియలకు 20 మందికి మించి అనుమతించరు. దహన సంస్కారాలకు మినహా 10 మందికి పైగా సమావేశం కావాల్సి వస్తే జిల్లా యంత్రాంగం ముందస్తు అనుమతి తీసుకోవాలి. ర్యాపిడ్ టెస్టింగ్‌లను ప్రోత్సహించేందుకు ప్రైవేటు ల్యాబ్స్‌లలో ఆర్టీ-పీసీఆర్ టెస్టులను రూ.450కి, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టింగ్ (ఆర్ఏటీ)ని రూ.300కు తగ్గించారు. బస్సులు, టాక్సీలు, ఆటోల్లో 50 శాతం సామర్థ్యానికి పరిమితం చేయాలని రవాణా శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు.