పార్టీ త్రిసభ్య ప్యానల్ ముందుకు కెప్టెన్ అమరీందర్

ABN , First Publish Date - 2021-06-22T19:09:33+05:30 IST

పంజాబ్ కాంగ్రెస్ యూనిట్‌లో తలెత్తిన అంతర్గత పోరు హస్తినకు చేరుకుంది. దీనిపై కాంగ్రెస్..

పార్టీ త్రిసభ్య ప్యానల్ ముందుకు కెప్టెన్ అమరీందర్

న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్ యూనిట్‌లో తలెత్తిన అంతర్గత పోరు హస్తినకు చేరుకుంది. దీనిపై కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీని కలుసుకునేందుకు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ మంగళవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. మల్లికార్జున్ ఖర్గే సారథ్యంలోని కమిటీని కెప్టెన్ అమరీందర్ కలుస్తుండగా, ఆరుగురు మంత్రులతో సహా సుమారు డజను మంది రెబల్ నేతలు రాహుల్ గాంధీని కలుసుకోనున్నారు. పంజాబ్‌లో పరిస్థితిపై చర్చించేందుకు కెప్టెన్‌ను ఢిల్లీకి రమ్మని ప్యానల్ పిలిచారు. ఇటీవల కాలంలో కమిటీని ఆయన కలుసుకోనుండటం ఇది రెండోసారి.


పంజాబ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆదివారంనాడు మరోసారి కెప్టెన్‌పై మాటల దాడి చేయడంత వాతావరణం మరింత వేడెక్కింది. సిద్ధూ తన తాజా వ్యాఖ్యల ద్వారా పార్టీ ఆఫర్ చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పదవిని అంగీకరించేందుకు తాను సిద్ధంగా లేదనే  సంకేతాలిచ్చినట్టు చెబుతున్నారు. కాగా, ఏఐసీసీ కార్యదర్శి, ఫతేగఢ్ సాహిబ్ ఎమ్మెల్యే కుల్జిత్ సింగ్ నగ్రా సోమవారంనాడు రాహుల్‌ను కలిసారు. సాంకేతిక విద్యా శాఖ మంత్రి చరణ్‌జీత్ సింగ్ సైతం రాహుల్‌ను కలవాల్సి ఉండగా మంగళవారానికి వాయిదా పడింది. అకాలీదళ్ పార్టీ కష్టపడి పనిచేస్తుండగా, కాంగ్రెస్ మాత్రం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతోందని రెబల్ నేతల ఫిర్యాదుగా ఉంది.

Updated Date - 2021-06-22T19:09:33+05:30 IST