రాజ్‌భవన్ వద్ద గొర్రెలతో నిరసన
ABN , First Publish Date - 2021-05-20T07:06:11+05:30 IST
రాజ్‌భవన్ గేటు వద్ద గొర్రెలతో నిరసన తెలిపిన అంశాన్ని పశ్చిమబెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్ తీవ్రంగా పరిగణించారు

పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆగ్రహం
వివరణ ఇవ్వాలని పోలీసు కమిషనర్‌కు ఆదేశం
కోల్‌కతా, మే 19: రాజ్‌భవన్ గేటు వద్ద గొర్రెలతో నిరసన తెలిపిన అంశాన్ని పశ్చిమబెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్ తీవ్రంగా పరిగణించారు. దీనిపై సాయంత్రం 5 గంటలలోపు వివరణ ఇవ్వాలని బుధవారం కోల్‌కతా పోలీసు కమిషనర్‌ను ఆదేశించారు. ‘పోలీసుల వైఖరితో రాజ్‌భవన్ వద్ద కూడా శాంతిభద్రతల పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది. ఇక్కడ నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి కదా!’ అని గవర్నర్ ట్వీట్ చేశారు. దీనికి ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, సిటీ పోలీసులను ట్యాగ్ చేశారు. బెంగాల్‌లో కరోనా వ్యాప్తి వల్ల పరిస్థితి దిగజారుతుండటంపై ఉన్నత పదవుల్లోని వ్యక్తులు దృష్టి సారించడం లేదని ఆరోపిస్తూ మంగళవారం కోల్‌కతా నాగరిక్ మంచ్ అనే స్వచ్ఛంద సంస్థ రాజ్‌భవన్ గేటు వద్ద గొర్రెలతో ఆందోళన నిర్వహించింది. అయితే, అదే రోజు గవర్నర్ జన్మదినం కూడా కావడం విశేషం. నార్త్ గేటు వద్ద 7 నిమిషాలు ఈ ఆందోళన కొనసాగింది. అనంతరం ఆందోళనకారులను, గొర్రెలను పోలీసులు అక్కడి నుంచి తరిమేశారు. ‘రాజ్‌భవన్ ఆవరణలో భద్రతా వైఫల్యాన్ని నేను గుర్తించారు. పోలీసుల ఎదుటే నార్త్ గేటు వద్ద కొన్ని అసాంఘిక శక్తులు రెండు గంటల పాటు వికృత చేష్టలు కొనసాగించాయి’ అని గవర్నర్ ఆక్షేపించారు. కాగా, కరోనా నేపథ్యంలో మనుషుల ఆందోళనలకు అనుమతించడం లేదు గనుక గొర్రెలతో ఆందోళన నిర్వహించామని కోల్‌కతా నాగరిక్ మంచ్ అధికార ప్రతినిధి తెలిపారు.