యూపీ బాలికలకు ప్రియాంక గాంధీ హామీలు

ABN , First Publish Date - 2021-10-21T20:11:12+05:30 IST

ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు త్వరలో జరగనుండటంతో

యూపీ బాలికలకు ప్రియాంక గాంధీ హామీలు

లక్నో : ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు త్వరలో జరగనుండటంతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా బాలికలపై హామీల జల్లు కురిపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపడితే ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణులైన బాలికలకు స్మార్ట్‌ఫోన్, డిగ్రీ పాసైన యువతులకు ఎలక్ట్రానిక్ స్కూటీ ఇస్తుందని గురువారం ఓ ట్వీట్ ద్వారా హామీ ఇచ్చారు. 


శాసన సభ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టిక్కెట్లు ఇస్తామని ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆమె గురువారం ఇచ్చిన ట్వీట్‌లో, తాను బుధవారం కొందరు విద్యార్థినులను కలిశానని తెలిపారు. తాము చదువుకోవడానికి, తమ భద్రత కోసం తమకు స్మార్ట్‌ఫోన్లు అవసరమని విద్యార్థినులు చెప్పారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణులైన బాలికలకు స్మార్ట్‌ఫోన్లు, డిగ్రీ ఉత్తీర్ణులైన యువతులకు ఎలక్ట్రానిక్ స్కూటీలు ఇవ్వాలని  యూపీ కాంగ్రెస్ నిర్ణయించిందని తెలిపారు. మేనిఫెస్టో కమిటీ సమ్మతితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 


ఆమె ఈ ట్వీట్‌కు ఓ వీడియోను జత చేశారు. తాము ప్రియాంక గాంధీ వాద్రాతో ఫొటోలు తీయించుకున్నట్లు కొందరు విద్యార్థినులు మీడియాతో చెప్తున్నట్లు ఈ వీడియోలో కనిపించింది. 


Updated Date - 2021-10-21T20:11:12+05:30 IST