జాతీయ జెండాకు అవమానం.. దేశ ప్రజలందరినీ బాధించింది

ABN , First Publish Date - 2021-02-01T07:10:05+05:30 IST

గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో జాతీయ జెండాకు జరిగిన అవమానాన్ని చూసి యావత్‌ భారతదేశం ఎంతో బాధపడిందని ప్రధాని మోదీ అన్నారు. రైతులు నిర్వహించిన ట్రాక్టర్‌ ర్యాలీ

జాతీయ జెండాకు అవమానం.. దేశ ప్రజలందరినీ బాధించింది

వ్యవసాయాన్ని ఆధునికీకరిస్తాం.. మన్‌కీబాత్‌లో ప్రధాని మోదీ 


న్యూఢిల్లీ, జనవరి 31: గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో జాతీయ జెండాకు జరిగిన అవమానాన్ని చూసి యావత్‌ భారతదేశం ఎంతో బాధపడిందని ప్రధాని మోదీ అన్నారు. రైతులు నిర్వహించిన ట్రాక్టర్‌ ర్యాలీ హింసాత్మకమవడం, ఎర్రకోటపై మతపరమైన జెండాను ఎగురవేసిన ఘటనను ఉద్దేశించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయాన్ని ఆధునికీకరించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని స్పష్టం చేశారు. ఆ దిశగా అనేక చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతినెలా చివరి ఆదివారం నిర్వహించే మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ ప్రజలతో అనేక విషయాలను పం చుకున్నారు. దేశవ్యాప్తంగా పండగలు, ఉ త్సవాలు, రిపబ్లిక్‌ డే, ఆస్ట్రేలియాపై మన క్రికెట్‌ జట్టు సాధించిన చిరస్మరణీయ టెస్టు సిరీస్‌ విజయం వంటి ఘటనలతో ఈ ఏ డాది జనవరి వేగంగా గడిచిపోయిందన్నారు.


కానీ, జనవరి 26న ఢిల్లీలో త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానం ప్రతి ఒక్కరినీ బాధించిందని చెప్పారు. గత ఏడాది మనం సహనం, ధైర్యంతో కరోనాపై పోరాడామని.. ఈ ఏడాదీ అదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. ప్రస్తుతం మనం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ ప్రక్రియను చేపట్టామని, అత్యంత వేగంగా టీకాలు వేస్తున్నామని మోదీ తెలిపారు. కాగా, ‘ప్రబుద్ధ భారత’ మాస పత్రిక 125వ వార్షికోత్సవం సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ప్రపంచ సమస్యలకు దేశం పరిష్కారాలు చూపుతోందని చెప్పారు. కొవిడ్‌ నుంచి వాతావరణ మార్పుల వరకు అనేక సమస్యలకు పరిష్కారాలు చూపుతోందన్నారు. తమ ప్రభు త్వం స్వామి వివేకానంద మార్గంలో నడుస్తోందని తెలిపారు. 


బోయిన్‌పల్లి మార్కెట్‌ భేష్‌

దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో పలువురు చేస్తున్న కృషిని ప్రధాని మోదీ ప్రశంసించారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి కూరగాయల మార్కెట్‌ను ప్రస్తావించారు. ‘‘మార్కెట్‌లో  కూరగాయలు కుళ్లిపోవడం, పాడైపోవడం మనకు తెలుసు. దీనివల్ల వ్యాధులు ప్రబలే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి మార్కెట్‌లో కూరగాయల వ్యర్థాల నుంచి విద్యుత్తును తయారు చేయాలని నిర్ణయించారు. ఇక్కడి విద్యుదుత్పత్తి ప్లాంట్‌కు రోజూ 10 టన్నుల వ్యర్థాలు వస్తాయి. వీటితో 500 యూనిట్ల విద్యుత్తును తయారు చేస్తున్నారు. ఆ విద్యుత్తుతోనే మార్కెట్‌లో వెలుగులు నిండుతున్నాయి. బయో ఇంధనంతో క్యాంటీన్‌లో ఆహార పదార్థాలను వండుతున్నారు’’ అని కొనియాడారు. 

Updated Date - 2021-02-01T07:10:05+05:30 IST