రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బంగ్లాదేశ్‌ పర్యటన ప్రారంభం

ABN , First Publish Date - 2021-12-15T20:24:00+05:30 IST

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బంగ్లాదేశ్‌ పర్యటన బుధవారం

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బంగ్లాదేశ్‌ పర్యటన ప్రారంభం

ఢాకా : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బంగ్లాదేశ్‌ పర్యటన బుధవారం ప్రారంభమైంది. ఆయన తన సతీమణి సవిత, కుమార్తె స్వాతిలతో కలిసి ప్రత్యేక ఎయిరిండియా వన్ విమానం నుంచి దిగుతుండగా బంగ్లాదేశ్ ఘన స్వాగతం పలికింది. ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ హమీద్, ఆయన సతీమణి రషీదా ఖానమ్ ఢాకాలోని హజ్రత్ షహజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. కోవింద్‌కు స్వాగతం పలికినవారిలో ఆ దేశ మంత్రులు, సైనిక, సాధారణ పరిపాలన శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు. 


రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బంగ్లాదేశ్‌లో మూడు రోజులపాటు పర్యటిస్తారు. స్వతంత్ర బంగ్లాదేశ్ స్వర్ణోత్సవాలలో పాల్గొనడంతోపాటు ఆ దేశాధ్యక్షుడు అబ్దుల్ హమీద్‌, తదితరులతో చర్చలు జరుపుతారు. 1971లో పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందింది. 


భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో, రాష్ట్రపతి బంగ్లాదేశ్ పర్యటనను గొప్ప ప్రారంభంగా అభివర్ణించారు. ఢాకా చేరుకున్న రాష్ట్రపతి కోవింద్ దంపతులకు బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ దంపతులు స్వాగతం పలికారని, ఇది సుహృద్భావ సంకేతమని తెలిపారు. రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పారని, 21-గన్ శాల్యూట్, గార్డ్ ఆఫ్ ఆనర్‌లతో స్వాగతం పలికారని పేర్కొన్నారు. 


బంగ్లాదేశ్ సైన్యం, నావికా దళం, వైమానిక దళం సిబ్బంది రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఢాకా విమానాశ్రయంలో గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. అక్కడి నుంచి ఆయన నగర శివారులోని అమర వీరుల స్మారక కేంద్రం వద్ద అమర వీరులకు నివాళులర్పించారు. విముక్తి పోరాట ఆదర్శాలను సాకారం చేసుకోవడానికి జీవితాలను త్యాగం చేసినవారి స్ఫూర్తి మన ఆలోచనలు, చర్యలకు మార్గదర్శనంగా నిలవాలని కోవింద్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కోవింద్ ఓ అశోక మొక్కను నాటారు. సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య దినోత్సవాలలో పాల్గొనడం తనకు చాలా సంతోషంగా ఉందని రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు. 


Updated Date - 2021-12-15T20:24:00+05:30 IST