పాకిస్థాన్‌కు నిధులు ఆపేయాలని యూఎస్‌ను కోరిన ఆప్ఘన్ పాప్‌స్టార్ ఆర్యన

ABN , First Publish Date - 2021-08-22T01:16:04+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశం కావడంతో తనకు రక్షణ లేదని భావించి దేశం విడిచి వెళ్లి ఆఫ్ఘన్ పాప్‌స్టార్

పాకిస్థాన్‌కు నిధులు ఆపేయాలని యూఎస్‌ను కోరిన ఆప్ఘన్ పాప్‌స్టార్ ఆర్యన

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశం కావడంతో తనకు రక్షణ లేదని భావించి దేశం విడిచి వెళ్లి ఆఫ్ఘన్ పాప్‌స్టార్ ఆర్యన సయీద్.. పాకిస్థాన్‌పై విరుచుకుపడింది. ఆ దేశం ఉగ్రవాదులను తయారుచేస్తూ ఆఫ్ఘన్‌పైకి ఉసిగొల్పుతోందని ఆరోపించింది. అమెరికా విమానంలో దేశం విడిచి వెళ్తున్న ఫొటోలను నిన్న తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఆర్యన.. తాను ఇస్తాంబుల్ చేరుకుని షాక్ నుంచి తేరుకున్న తర్వాత బోల్డన్ని విషయాలను పంచుకుంటానని పేర్కొంది. అన్నట్టుగానే నేడు తన సోషల్ మీడియా ఖాతాలో ఆఫ్ఘనిస్థాన్‌లోని ప్రస్తుత పరిస్థితికి అద్దం పట్టే ఫొటోలను షేర్ చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను ఉద్దేశించి.. ఆఫ్ఘనిస్థాన్‌ను ఇలా గందరగోళ పరిస్థితుల మధ్య వదిలేసి వెళ్లిపోతారని తాను ఊహించలేదని, తాను నమ్మలేకపోతున్నానని పేర్కొంది. అలాగే, పాకిస్థాన్‌కు వెంటనే నిధులు ఆపేయాలని కోరింది. అమెరికా నుంచి అందుకుంటున్న నిధులను పాకిస్థాన్ ఉగ్రవాదుల తయారీ కోసం వినియోగిస్తోందని ఆరోపించింది. అలా తయారైన ఉగ్రవాదులను అల్ ఖాయిదా, ఐసిస్, తాలిబన్ వంటి పేర్లతో ఆఫ్ఘనిస్థాన్‌పైకి ఉసిగొల్పుతోందని ఆర్యన ఆరోపించింది. 

Updated Date - 2021-08-22T01:16:04+05:30 IST