గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన Kalicharan Maharaj అరెస్ట్
ABN , First Publish Date - 2021-12-30T14:33:26+05:30 IST
మహాత్మాగాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాళీచరణ్ మహారాజ్‌ను రాయపూర్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు....

రాయపూర్ : మహాత్మాగాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాళీచరణ్ మహారాజ్‌ను రాయపూర్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.ఖజురహోలో ఉన్న కాళీ చరణ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని రాయపూర్ ధరమ్ సంసద్ కార్యక్రమంలో కాళీచరణ్ మాట్లాడుతూ గాంధీజిని దూషించడంతోపాటు మహాత్మాగాంధీజీని చంపిన నాథూరామ్ గాడ్సేను ప్రశంసించారు.రాయ్‌పూర్ మాజీ మేయర్ ప్రమోద్ దూబే ఫిర్యాదు మేర రాయ్‌పూర్‌లోని తిక్రపారా పోలీస్ స్టేషన్లో కాళీచరణ్ మహారాజ్‌పై కేసు నమోదైంది. కాళీ చరణ్ పై ఐపీసీ సెక్షన్ 505(2) సెక్షన్ 294 లకింద పోలీసులు కేసు పెట్టారు.రాయ్‌పూర్‌లో కేసు నమోదు అయిన వెంటనే కాళీచరణ్ మహారాజ్ ఛత్తీస్‌గఢ్ నుంచి తప్పించుకున్నట్లు సమాచారం.
కాళీచరణ్ ను పట్టుకునేందుకు పోలీసులు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపారు.రాయ్‌పూర్ ధరమ్ సంసద్‌లో మహాత్మా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ హామీ ఇచ్చారు.మహాత్మా గాంధీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన కాళీచరణ్ మహారాజ్‌పై మహారాష్ట్ర మంత్రి జితేంద్ర అవద్ థానే నగరంలో పోలీసు కేసు పెట్టారు.మతపరమైన భావాలను కించపరిచేలా ఉద్దేశపూర్వకంగా, ద్వేషపూరితంగా వ్యవహరించడంతోపాటు ఇతర నేరాలకు పాల్పడినందుకు గాను కాళీ చరణ్ పై ఐపీసీ సెక్షన్లు 294, 295A, 298, 505(2), 506(2)ల కింద కేసు నమోదు చేసినట్లు నౌపడ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.