రైతు సంఘాల నేతలతో పోలీసుల భేటీ

ABN , First Publish Date - 2021-01-20T20:38:04+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ..

రైతు సంఘాల నేతలతో పోలీసుల భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నేతలతో ఢిల్లీ పోలీసులు బుధవారం సమావేశమయ్యారు. గణతంత్ర దినోత్సవం రోజున ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాలని రైతు సంఘాలు తలపెట్టాయి. ఈ ట్రాక్టర్ ర్యాలీ జరిగే ప్రాంతాల రూట్ మ్యాప్‌పై పోలీసులు చర్చిస్తున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇబ్బంది కలగకుండ ఎలా ర్యాలీ నిర్వహిస్తారో చెప్పాలని రైతులను పోలీసులు అడిగారు.


కాగా మరి కాసేట్లో రైతు సంఘాల నేతలతో కేంద్రం పదో విడత చర్చలు జరపనుంది. అయితే తమ డిమాండ్లను నెరవేర్చేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని రైతులు స్పష్టం చేశారు. అయితే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేదిలేదని, సవరణలు కావాలంటే చేయడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్రం చెబుతోంది.


మరోవైపు కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ గణతంత్ర దినోత్సం రోజున రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ అనుమతిపై బుధవారం సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ర్యాలీపై తాము ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయబోమని స్పష్టం చేసింది. ఈ ట్రాక్టర్ ర్యాలీకి అనుమతి ఇవ్వాలా... వద్దా? అన్నది పోలీసులే నిర్ణయించుకోవాలని స్పష్టం చేసింది. గణతంత్ర దినోత్సవం రోజున ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాలని రైతు సంఘాలు తలపెట్టాయి. ఈ ర్యాలీకి అనుమతి కావాలంటూ రైతులు సుప్రీం మెట్లెక్కారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి ఇవ్వొద్దంటూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్‌ను దాఖలు చేసింది. దీంతో సుప్రీం కోర్టు ఈ రెండు పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.  ‘‘ఏదైనా ర్యాలీని గానీ, ఊరేగింపును గానీ అనుమతించాలా? వద్దా? అన్న విషయంపై ఉత్తర్వులు ఇవ్వడాన్ని మేం అన్యాయంగా చూస్తాం. అది పోలీసు విభాగం తేల్చాల్సిన విషయం. అనుమతి ఇవ్వాలా? వద్దా? అన్నది పోలీసులే నిర్ణయించాలి. వారే సర్వ సమర్థులు. మేము దీనిపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయబోము’’ అని సుప్రీం స్పష్టం చేసింది.  ఈ నేపథ్యంలో పోలీసులు రైతు సంఘాల నేతలతో భేటీ అయ్యారు.  

Updated Date - 2021-01-20T20:38:04+05:30 IST