పోలీస్ క్రిమినల్!
ABN , First Publish Date - 2021-03-24T10:06:41+05:30 IST
పోలీస్ క్రిమినల్!

63 ఎన్‌కౌంటర్లు.. వందల కొద్దీ దందాలు
లైఫంతా మాఫియాను డీల్ చేయడమే
రాజకీయ దన్నుతో ఎదిగిన ఖాకీ
సచిన్ వాజే కేసులో అంతు తేలని ప్రశ్నలు
‘‘...ముంబైలో భాయ్ లేకపోవడంతో.. మీరంతా (క్రిమినల్స్) ఇలా అయిపోయారు. ఇక నేనే మీకు భాయ్... మాఫియాను లీగల్ చేసేస్తా. ఇవాళ మనకంటూ ఓ రేంజ్ ఉంది. డిపార్ట్‌మెంట్ కూడా మనకి సపోర్ట్. మనం క్రిమినల్స్.. క్రైమ్ చేసుకునే బతకాలి. నేను మీకు పనిస్తా... కలిసి పనిచేసుకుందాం...’’ బిజినెస్‌మ్యాన్ అనే సినిమాలో హీరో చెప్పే డైలాగిది. అందులో హీరో క్రిమినల్ షేడ్ ఉన్నవాడు.. ఇవే డైలాగులు ఇదే రీతిలో ఓ పోలీస్ చెబితే ఎలా ఉంటుంది..? ఎస్.. నిజం. ఆ పోలీస్ అధికారి కూడా ముంబై వాడే. అతను కొన్నేళ్లుగా చేస్తున్న పనీ ఇదే.. ! క్రిమినలా లేక సూపర్ పోలీసా..? అని డౌటొచ్చే ఆ అధికారి పేరు సచిన్ వాజే. ప్రస్తుతం అరెస్టయి, ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్నాడు.
ఒక ప్రభుత్వ ఉద్యోగి, లేదా పోలీసు అధికారి సస్పెండయి, రాజీనామా చేశాక మళ్లీ పోస్టింగ్ దక్కుతుందా..? అదీ 16 సంవత్సరాల తరువాత..? కానీ విచిత్రం.. సచిన్ వాజేకు దక్కింది. 2004లో సస్పెండయితే 2020లో కీలక విభాగంలో పోస్టింగ్. ఇదెలా సాధ్యం? వడ్డించేవాడు మనవాడయ్యాడు కాబట్టి!
ముంబై, మార్చి 23: మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన సచిన్ వాజే 1990లో ఎస్సైగా పోలీసు శాఖలో చేరాడు. మొదటి పోస్టింగ్ నక్సల్-ప్రభావ ప్రాంతమైన గడ్చిరోలిలో! తరువాత థానేకు బదిలీ అయి అక్కడి నుంచి ముంబైకి ట్రాన్స్‌ఫర్ అయ్యాడు. ప్రదీప్‌శర్మ, దయా నాయక్‌లతో పాటు ఈయన కూడా ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు. కెరీర్‌లో 63 మంది కరడుగట్టిన నేరగాళ్లను ఎన్‌కౌంటర్ చేసిన రికార్డు వాజేది. దందాలు, కిడ్నాపులు, దోపిడీ రాకెట్ల సరేసరి. మాఫియాతో చేతులు కలిపిన నేర చరిత్ర వాజేదని ముంబై పోలీస్ వర్గాలు అంటున్నాయి. 2003లో ఘట్‌కోపర్ బాంబు పేలుడు కేసులో నిందితుడైన ఖ్వాజా యూనిస్ కస్టడీలో చనిపోయిన కేసులో సస్పెండై.. శివసేనలో చేరాడు.
ఖాకీ డ్రెస్‌కు ఆవల...!
వాజే సాంకేతికతలో దిట్ట. ఎన్నో సైబర్ కేసులను ఛేదించిన రికార్డుంది. సెల్‌ఫోన్ ఇంటర్‌సెప్షన్, ఈమెయిల్ ట్రాకింగ్ విభాగాలను ముంబై కమిషనరేట్‌లో ఏర్పాటు చేశారు. 1997లో అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్ రాకెట్‌ను బట్టబయలు చేసి ఆసియాలోనే అలాంటి క్రిమినల్స్‌ను అరెస్ట్ చేసిన వ్యక్తిగా పేరుగడించాడు. ముంబై దాడులు, నిందితుడు డేవిడ్ హెడ్లీ, షీనా బోరా హత్య కేసుపై పుస్తకాలు రాశాడు. ఫేస్‌బుక్ తరహాలో మరాఠీలో ‘లాయ్‌భారీ’ని సృష్టించాడు.
అంబానీ కేసే పట్టిచ్చింది!
శివసేన ప్రభుత్వం వచ్చాక వాజే మళ్లీ రంగప్రవేశం చేశాడు. కొవిడ్ వల్ల ఆఫీసర్లు తక్కువయ్యారంటూ సంకీర్ణ సర్కార్ అతడిని విధుల్లోకి తీసుకుంది. కీలకమైన క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్(సీఐయూ)కి హెడ్‌గా ఉంటూ.. అర్ణబ్ గోస్వామి కేసు, టీఆర్పీ స్కాం, హృతిక్ రోషన్ ఫేక్ ఈమెయిల్ కేసు, దిలీప్ చాబ్రియా కేసులాంటి హైప్రొఫైల్ కేసులెన్నింటినో ఆయన దగ్గరుండి పర్యవేక్షించాడు. అయితే వాజే కథకు తాత్కాలికంగా ఫుల్‌స్టాప్ పడినది మాత్రం అంబానీ నివాసం వద్ద జిలెటిన్ స్టిక్స్‌తో నిండిన ఓ స్కార్పియో వాహనం ఫిబ్రవరి 25న లభ్యం కావడం! ఈ వాహనాన్ని అక్కడ పెట్టింది సచిన్ వాజేయేనని ఎన్‌ఐఏ అంటోంది. విశేషమేమంటే అంబానీ ఇంటి వద్ద పేలుడు వాహన కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నదీ వాజేనే. ఆకస్మికంగా మార్చి 13న ఆయనను ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. ఆ తరువాత సీఐయూలోని ఆయన కేబిన్ నుంచీ, ఇంటి నుంచీ అత్యంత కీలకమైన డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్‌లు, ఎలకా్ట్రనిక్ వస్తువులు, ఐదు లక్షల నగదు స్వాధీనపర్చుకుంది. ఈ వాహనాన్ని మన్‌సుఖ్ హిరేన్ అనే వ్యాపారవేత్త నుంచి నాలుగు నెలల కిందట వాజే తీసుకున్నారని, కొద్దిరోజుల కిందటే వాపస్ ఇచ్చారని కుటుంబసభ్యులు చెప్పారు. ఆ తర్వాత వర్లీ సమీపంలో వాజే, హిరేన్ కలిసి కార్లోనే మాట్లాడుకున్న దృశ్యాలు బయటపడ్డాయి. ఇది జరిగిన రెండ్రోజులకు హిరేన్ మృతదేహం సముద్రపు కయ్య వద్ద బయటపడింది. ఈ మృతికి కారకుడు వాజేయేనని ఏటీఎస్ ప్రకటించింది. ముఖేశ్ అంబానీకేమైనా బెదిరింపులు వెళ్లాయా, ఆయన దీనిపై కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించారా.. అన్నది వెల్లడి కాలేదు. కానీ ఎన్‌ఐఏ ఇంటరాగేషన్‌లో వాజే ఓ పోలీస్ ఉన్నతాధికారి పేరు, కొందరు శివసేన నేతల పేర్లు బయటపెట్టినట్లు తెలియగానే సీఎం ఉద్ధవ్ ఠాక్రే తీవ్రంగా ఆందోళన చెందారు.
బీజేపీ సమాంతర దర్యాప్తు!
సచిన్ వాజేను విధుల్లోకి తీసుకున్నప్పటి నుంచీ బీజేపీ అతని కదలికలపై కన్నేసింది. ఆయన వ్యవహారాలను డిపార్ట్‌మెంట్ ద్వారానే తెలుసుకుంటూ వచ్చినట్లు తెలుస్తోంది. సమాంతరంగా ఆయా కేసులపై కూపీలాగింది. ముఖ్యంగా పోలీస్ కమిషనర్‌గా ఉన్న పరమ్‌బీర్ సింగ్‌ను బీజేపీ ట్రాప్ చేసినట్లు సమాచారం. వాజే తన ఇంటరాగేషన్‌లో పరమ్‌బీర్ పేరును బయటపెట్టడంతో ఎన్‌ఐఏ ఆయనను వ్యూహాత్మకంగా ముందుకు తోసినట్లు తెలుస్తోంది. పరమ్‌బీర్‌కు వాజే అంటే పడదు. వాజే నేరుగా హోంమంత్రి దేశ్‌ముఖ్‌కు, ఇతర ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయడం, వారు అతనిని చేరదీసి పనులు చేయించుకోవడం ఆయనకు అసంతృప్తి కలిగించింది. చివరకు కేసు ముదిరి, వాజే అరెస్టయి, తనను బదిలీ చేయడంతో పరమ్‌బీర్ ఎదురుతిరిగారు. సీఎంకు లేఖ, సుప్రీంలో కేసు... ఇవన్నీ బీజేపీ నడిస్తున్నదేనని పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి.