భార‌త్‌ స్వీయ సంక‌ల్పంతో ముందుకు న‌డుస్తుంది: ప్ర‌ధాని మోదీ

ABN , First Publish Date - 2021-05-30T18:03:47+05:30 IST

భార‌త్ ఇత‌ర దేశాల ఒత్తిడిల‌కు లోబ‌డి లేద‌ని...

భార‌త్‌ స్వీయ సంక‌ల్పంతో ముందుకు న‌డుస్తుంది: ప్ర‌ధాని మోదీ

న్యూఢిల్లీ: భార‌త్ ఇత‌ర దేశాల ఒత్తిడిల‌కు లోబ‌డి లేద‌ని, స్వీయ సంక‌ల్పంతోనే ముందుకు న‌డుస్తున్న‌ద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు త‌న రేడియో కార్య‌క్ర‌మం మ‌న్ కీ బాత్‌లో ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించిన ప్ర‌సంగించారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో కోవిడ్-19 మహమ్మారిపై పోరాటం గురించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. దేశం త‌న సంపూర్ణ‌శ‌క్తియుక్తుల‌తో కోవిడ్-19పై పోరాడుతోందని పేర్కొన్నారు.  తౌతే, యాస్ తుఫాను, స్వల్ప భూకంపాల గురించి కూడా ప్రధాని మోడీ ప్రస్తావించారు. విప‌త్తులు అనేక రాష్ట్రాలను ప్రభావితం చేశాయ‌న్నారు. ఈ విప‌త్తుల సంద‌ర్భంగా సహాయక చర్యల్లో పాల్గొన్న వారికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. విపత్తుల్లో ప్రాణాలు కోల్పోయిన‌ వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. 


తుపానుకు ప్రభావితమైన అన్ని రాష్ట్రాల ప్రజలు ఈ సంక్షోభ సమయంలో ఎంతో సహనంతో, క్రమశిక్షణతో ధైర్యాన్ని చూపించిన తీరును కొనియాడారు.  ఈ విపత్తును ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థ‌లు అన్నీ కలిసి పనిచేస్తున్నాయ‌న్నారు. మోదీ ఈ కార్యక్రమంలో ఆక్సిజన్ ట్యాంకర్ నడుపుతున్న దినేష్ ఉపాధ్యాయ్‌తో మాట్లాడారు. యూపీలోని జౌన్‌పూర్ నివాసి ఉపాధ్యాయ్ మాట్లాడుతూ త‌న జీవితంలో ఇలాంటి సేవ చేసే అవకాశం క‌లినందుకు సంతోషిస్తున్నాన‌ని అన్నారు. కాగా ప్ర‌స్తుత కరోనా సంక్షోభ సమయంలో ఆక్సిజన్ సరఫరాలో వైమానిక దళం కూడా ప్రధాన పాత్ర పోషించింది. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ పట్నాయక్ ప్రధాని మోదీతో తన అనుభవాలను పంచుకున్నారు. ఈ సంక్షోభ సమయంలో దేశ ప్రజలకు సహాయ ప‌డ‌ట‌మ‌నేది త‌మ‌కు ద‌క్కిన గొప్ప అదృష్టమ‌న్నారు.  అనంత‌రం మోదీ మాట్లాడుతూ త‌మ ప్రభుత్వం ఏడు సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న‌ద‌ని అన్నారు. కొన్నేళ్లుగా దేశం 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా-విశ్వాస్' అనే మంత్రంతో నడుస్తున్న‌ద‌న్నారు. గ‌డ‌చిన ఈ ఏడు సంవత్సరాలలో సాధించిన విజయాలు దేశానివ‌ని, దేశ ప్రజలవ‌ని మోదీ పేర్కొన్నారు. భారతదేశం ఇప్పుడు స్వీయ‌ సంకల్పంతోనే ముందుకు న‌డుస్తున్న‌ద‌ని అన్నారు. దేశంపై ఇతర దేశాల ఆలోచనలు, ఒత్తిడిలు లేకుండా ముందుకు సాగుతున్నందుకు మనమందరం గర్వపడాల‌న్నారు. జాతీయ భద్రతా సమస్యలపై భారత్ రాజీపడబోద‌ని, మన త్రివిధ దళాల బలం పెరిగింద‌ని, ఈ కార‌ణంగానే దేశం సరైన మార్గంలో ఉంది భావిస్తున్నామ‌ని ప్ర‌ధాని మోదీ పేర్కొన్నారు.

Updated Date - 2021-05-30T18:03:47+05:30 IST