కోవిడ్-19 వ్యాక్సిన్ సరఫరాను పెంచేందుకు గట్టి కృషి : మోదీ

ABN , First Publish Date - 2021-05-18T22:36:33+05:30 IST

కోవిడ్-19 వ్యాక్సిన్లను పెద్ద ఎత్తున సరఫరా చేసేందుకు తీవ్రంగా నిరంతరం

కోవిడ్-19 వ్యాక్సిన్ సరఫరాను పెంచేందుకు గట్టి కృషి : మోదీ

న్యూఢిల్లీ : కోవిడ్-19 వ్యాక్సిన్లను పెద్ద ఎత్తున సరఫరా చేసేందుకు తీవ్రంగా నిరంతరం కృషి చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూలును 15 రోజులు ముందుగా రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ముందుగా షెడ్యూలును ఇవ్వడం వల్ల అందుకు అనుగుణంగా సన్నాహాలు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. మంగళవారం ఆయన వివిధ రాష్ట్రాల్లోని జిల్లా అధికారులతో జరిగిన వర్చువల్ సమావేశంలో ఈ అంశాలను వెల్లడించారు. ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) ట్విటర్ వేదికగా ఈ వివరాలను వెల్లడించింది.


కోవిడ్-19 మహమ్మారి రెండో ప్రభంజనం నేపథ్యంలో జరిగిన ఈ సమావేశంలో మోదీ మాట్లాడుతూ, కరోనాపై జరుగుతున్న యుద్ధంలో జిల్లా అధికారులు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారని ప్రశంసించారు. ఓ విధంగా చెప్పాలంటే యుద్దంలో ఫీల్డ్ కమాండర్లు పోషించే పాత్రను ప్రస్తుతం కోవిడ్-19పై పోరాటంలో జిల్లా అధికారులు పోషిస్తున్నారని అన్నారు. అధికారులు తమ విధి నిర్వహణకే పెద్ద పీట వేస్తున్నారని, కొందరు తమ కుటుంబ సభ్యులను కూడా కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ అయిన అధికారులు కూడా విధులు నిర్వహిస్తుండటాన్ని ప్రశంసించారు.


కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించడంలో పాటించవలసిన ముఖ్యాంశాల్లో కొన్నిటిని వివరిస్తూ, టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్‌మెంట్ చాలా ముఖ్యమైనవని చెప్పారు. కోవిడ్-19 నిరోధక మార్గదర్శకాలను పాటించాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలపై ఎక్కువ శ్రద్ధ చూపాలని కోరారు. 


కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోపాటు, కర్ణాటక, బిహార్, అస్సాం, చండీగఢ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, మధ్య ప్రదేశ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన జిల్లాల అధికారులు ఈ వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-18T22:36:33+05:30 IST