రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ స్టేట్ యూనివర్శిటీకి మోదీ శంకుస్థాపన

ABN , First Publish Date - 2021-09-14T19:26:19+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ స్టేట్ యూనివర్శిటీకి ప్రధాని నరేంద్ర..

రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ స్టేట్ యూనివర్శిటీకి మోదీ శంకుస్థాపన

అలీగఢ్: ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ స్టేట్ యూనివర్శిటీకి ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారంనాడు శంకుస్థాపన చేశారు. రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ స్టేట్ యూనివర్శిటీ ఎగ్జిబిషన్ మోడల్, ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ మోడల్స్‌ను ప్రధాని సందర్శించారు. రాష్ట్ర గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, విద్యావేత్త, సంఘసంస్కర్త రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ స్మృత్యర్థం రాష్ట్ర ప్రబుత్వం ఈ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తోంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి యోగి ఆదిత్యనాథ్ కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఇటు విలువైన ప్రాణాలు, అటు జీవనోపాధి రెండింటినీ మోదీ కాపాడారని ప్రశంసించారు.


లోథా, ముసేపూర్ కరీమ్ జరౌలి గ్రామాల్లోని మొత్తం 92 ఎకరాల్లో ఈ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నారు. అలీగఢ్ డివిజన్‌లోని 395 కాలేజీలకు అనుబంధంగా ఈ యూనివర్శిటీ ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, ప్రధాని మోదీ 2018 ఫిబ్రవరి 21న లక్నోలో జరిగిన ఉత్తరప్రదేశ్ ఇన్వెస్టర్స్ సమ్మట్‌లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నట్టు  ప్రకటించారు. అలీగఢ్, ఆగ్రా, కాన్పూర్, చిత్రకూట్, ఝాన్సీ, లక్నోలను ఈ కారిడార్ కలుపుతుంది. అలీగఢ్ నోడ్‌లో భూమి కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. 19 సంస్థలకు భూముల కేటాయింపు జరిగింది. ఆ సంస్థలు రూ.12245 కోట్లు ఇన్వెస్ట్ చేస్తాయి. ఉత్తరప్రదేశ్‌లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు రక్షణ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించడానికి, మేక్ ఇన్ ఇండియాను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి దోహదపడుతుంది.

Updated Date - 2021-09-14T19:26:19+05:30 IST