మే 2న దీదీ ఇంటికి వెళ్తారు.. అభివృద్ధి రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది : ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2021-03-24T18:17:56+05:30 IST

రాష్ట్రంలో ‘పరివర్తన’ రుచి ఏమిటో మే 2న ప్రజలు సీఎం మమతాకు రుచి చూపిస్తారని, ఇక మమత ఇంటికేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

మే 2న దీదీ ఇంటికి వెళ్తారు.. అభివృద్ధి రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది : ప్రధాని మోదీ

కోల్‌కతా : రాష్ట్రంలో ‘పరివర్తన’ రుచి ఏమిటో మే 2న ప్రజలు సీఎం మమతాకు రుచి చూపిస్తారని, ఇక మమత ఇంటికేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బెంగాల్‌లో మార్పు అత్యావశ్యకమని మోదీ నొక్కి వక్కాణించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ బుధవారం బెంగాల్‌లోని కంథీలో జరిగిన ర్యాలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ... ‘‘మే 2న దీదీ గద్దె దిగుతారు. రాష్ట్రంలోకి మార్పు ప్రవేశిస్తుంది.’’ అని మోదీ పేర్కొన్నారు. ఆంఫన్ తుపాను సందర్భంగా కేంద్రం కేటాయించిన నిధులను ఎవరు మింగారో చెప్పాలని బెంగాల్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారని, ఇప్పటికీ తుపాను బాధితులు కూలిన ఇళ్లలోనే ఎందుకు నివసిస్తున్నారో చెప్పాలని మోదీ డిమాండ్ చేశారు. బెంగాల్‌ను అభివృద్ధి చేస్తామన్న హామీకి తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. బెంగాల్ భవిష్యత్ కోసం తామంతా కష్టపడి పనిచేస్తామని మోదీ హామీ ఇచ్చారు. ఇక బెంగాల్‌లో ‘ఆట’ ముగిసి, ‘అభివృద్ధి శకం’ ప్రారంభమవుతుందని ప్రకటించారు.


కప్పం చెల్లించకుంటే అధికారులెవరూ ప్రజల పనులు చేయడం లేదని, రాష్ట్రంలో సిండికేట్ వ్యవస్థ రాజ్యమేలుతోందని మోదీ విరుచుకుపడ్డారు. తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి సీఎం మమత బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని, సంస్కృతిని, సంస్కృతికి వారధులుగా నిలిచిన వారిని మరిచిపోతున్నారని మోదీ ఆరోపించారు. దేశాన్ని ఏకం చేసిన ‘వందేమాతరం’ అన్న నినాదం బెంగాల్ నుంచే వచ్చిందని, కానీ మమత మాత్రం ‘అవుట్ సైడర్స్’ అంటూ అర్థంలేని పల్లవిని అందుకున్నారని ఎద్దేవా చేశారు. తామంతా ఈ భరత భూమి బిడ్డలమని, ఈ దేశంలో అవుట్ సైడర్స్ అంటూ ఎవరూ లేరని ఆయన స్పష్టం చేశారు. 

Updated Date - 2021-03-24T18:17:56+05:30 IST