పీఎం కేర్స్‌ వెంటిలేటర్లకు రిపేర్లు

ABN , First Publish Date - 2021-05-21T08:58:32+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వమే వాటికి మరమ్మతులు చేయించింది. వెంటిలేటర్లను వినియోగించాలని.. అలా అయితేనే అవి రీచార్జ్‌ అవుతాయని.. వాడకుండా పక్కన పెడితే పాడైపోతాయని ఇంజనీర్లు చెబుతున్నారు.

పీఎం కేర్స్‌ వెంటిలేటర్లకు రిపేర్లు

రాష్ట్రానికి 1,400 యంత్రాలు పంపిన కేంద్రం

అందులో 25% పరికరాలకు మరమ్మతు.. వాటి పనితీరుపై గతంలోనే కేంద్రానికి లేఖ 

మరమ్మతులు చేయించిన టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ.. ఇతర రాష్ట్రాల్లోనూ ఫిర్యాదులు


హైదరాబాద్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం పీఎం కేర్స్‌ ఫండ్స్‌ కింద పంపిన వెంటిలేటర్లు సరిగా పనిచేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణకు కేంద్రం 1,400 వెంటిలేటర్లను పంపింది. వాటిలో 25 శాతం సరిగా పనిచేయడం లేదని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. వచ్చిన వాటిలో ఎక్కువగా గాంధీ, కింగ్‌కోఠి, టిమ్స్‌ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేశారు. మొత్తం వెంటిలేటర్లలో 80 శాతం ఒకే కంపెనీవి వచ్చాయి. మరో 20 శాతం వేరే కంపెనీవి ఉన్నాయి. కరోనా మొదటి వేవ్‌ తర్వాత అన్ని రాష్ట్రాలకు కేంద్రం వెంటిలేటర్లను పంపింది. అప్పటి పరిస్థితుల ఆధారంగా విడి భాగాలను కొని, వాటిని బిగించి రాష్ట్రాలకు పంపింది. కంపెనీల నుంచి కొనుగోలు చేసిన వాటికి ఏడాదిపాటు వార్షిక నిర్వహణ ఒప్పందం ఉంటుంది. అంటే సంవత్సర కాలంలో ఆ యంత్రానికి మరమ్మతులు వచ్చినా, విడి భాగాలు పాడైపోయినా, సదరు కంపెనీనే చూసుకుంటుంది. అయితే కేంద్రం వెంటిలేటర్లు పంపింది కానీ, వాటి మరమ్మతుల గురించి పట్టించుకోలేదు.


ఆ బాధ్యత రాష్ట్రాలకూ అప్పగించలేదు. మరోవైపు, విడిభాగాలను అసెంబుల్‌ చేసి పంపిన వాటికి రిపేర్లు చేయడం మరింత కష్టమైంది.దీంతో మనరాష్ట్ర ప్రభుత్వమే వాటికి మరమ్మతులు చేయించింది.  వెంటిలేటర్లను వినియోగించాలని.. అలా అయితేనే అవి రీచార్జ్‌ అవుతాయని.. వాడకుండా పక్కన పెడితే పాడైపోతాయని ఇంజనీర్లు చెబుతున్నారు. కేంద్రం తొలి వేవ్‌ తర్వాతవెంటిలేటర్లను పంపింది. దాంతో వచ్చిన అన్నింటినీ వెంటనే వాడే పరిస్థితి రాలేదు. కొన్నింటిని వాడలేదు. ప్రస్తుతం వాటిని వాడదామనుకుంటే పనిచేయడం లేదు. మన దగ్గర రిపేరుకు వచ్చిన వాటికి ఇక్కడ విడి భాగాలు కూడా దొరకలేదు. దాంతో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో లేఖలు రాసింది. ఈ క్రమంలో కేంద్రం ఒక బృందాన్ని పంపింది. మరోవైపు టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ కూడా వెంటిలేటర్లు సరఫరా చేసిన కంపెనీలతో చర్చలు జరిపింది. తర్వాత వాటికి రిపేరు చేయించి వినియోగించారు. 


వెంటిలేటర్ల నాణ్యతపై విమర్శలు..

కేంద్రం పంపిన వెంటిలేటర్ల నాణ్యతపై ఇప్పటికే మూడు నాలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. కేంద్రం మొత్తం 58,850 వెంటిలేటర్లకు ఇండెంట్‌ పెట్టగా, అందులో 30 వేలను కొనుగోలు చేసింది. వాటిని అన్ని రాష్ట్రాలకు పంపారు. ఆ యంత్రాలను కొన్ని రాష్ట్రాలు అసలే వాడలేదు. వెంటిలేటర్లలో నాణ్యత లేదని, అవి పనిచేయడం లేదంటూ కొన్ని రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు రాశాయి. బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రాలు కేంద్రం పంపిన వెంటిలేటర్లను పక్కనపెట్టాయి. ఔరంగాబాద్‌ మెడికల్‌ కాలేజీకి ఇచ్చిన వెంటిలేటర్లలో నాణ్యతా లోపం ఉందని, అవి సరిగా పనిచేయడం లేదని అక్కడి ఆస్పత్రి నివేదిక ఇచ్చింది. పంజాబ్‌లో మూడు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు ఇచ్చిన 320 వెంటిలేటర్లలో 237 పనిచేయడం లేదని హిందూ పత్రిక కథనం ప్రచురించింది. వెంటిలేటర్ల నాణ్యతపై రాజస్థాన్‌ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. 

Updated Date - 2021-05-21T08:58:32+05:30 IST