మధ్యాహ్నం 3 గంటలకు పినరయి ప్రమాణస్వీకారం

ABN , First Publish Date - 2021-05-20T16:17:17+05:30 IST

కేరళ ముఖ్యమంత్రిగా పినరయ విజయన్ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు..

మధ్యాహ్నం 3 గంటలకు పినరయి ప్రమాణస్వీకారం

న్యూఢిల్లీ: కేరళ ముఖ్యమంత్రిగా పినరయ విజయన్ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. సెంట్రల్ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమంలో కేవలం 500 మంది హాజరవుతారు. పినరయి క్యాబినెట్‌లోకి 21 మందిని తీసుకోనున్నారు. వీరందరితో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. 140 మంది శాసనసభ్యులు, 29 మంది ఎంపీలు, జ్యూడిషియర్, మీడియా, ఇతర ఉన్నతాధికారులు ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. ఆహ్వానితులంతా 48 గంటలకు ముందు పరీక్ష చేయించుకున్న నెగిటివ్ టెస్ట్ రిజల్ట్ కానీ, వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుని ఉండాలి.


కాగా, కేబినెట్‌లోకి మాజీ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజను తీసుకోకపోవడంపై వస్తున్న విమర్శలపై పినరయి విజయన్ స్పందించారు. ముఖ్యమంత్రిగా తన రెండో టర్మ్‌లో కేకే శైలజను కేబినెట్‌లోకి తీసుకోరాదనే నిర్ణయం పార్టీ తీసుకుందని చెప్పారు. ఇది ఒక్క శైలజకే పరిమితం కాదని, గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులందరికీ వర్తిస్తుందని అన్నారు. కోవిడ్ దృష్ట్యా ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని విపక్ష కాంగ్రెస్ నిర్ణయించగా, ఇది దురదృష్టకరమని, ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని వారు బాయ్‌కాట్ చేయరనే తాను ఆశిస్తున్నట్టు పినరయి విజయన్ చెప్పారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం సారథ్యంలోని ఎల్‌డీఎఫ్ 99 సీట్లు గెలుచుకుని మెజారిటీ సాధించగా, కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ 41 సీట్లకు పరిమితమైంది.

Updated Date - 2021-05-20T16:17:17+05:30 IST