అమీర్‌ఖాన్‌పై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-07-12T21:23:01+05:30 IST

ప్రముఖ బాలీవుడ్ నటుడు అమిర్‌ఖాన్‌ను తప్పుపడుతూ మధ్యప్రదేశ్‌లోని మాండసౌర్ బీజేపీ..

అమీర్‌ఖాన్‌పై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటుడు అమిర్‌ఖాన్‌ను తప్పుపడుతూ మధ్యప్రదేశ్‌లోని మాండసౌర్ బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో జనాభా అసమతుల్యతకు అమీర్‌ఖాన్ వంటి వారే కారణమని అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, అమీర్ ఖాన్ ఇద్దరు పిల్లల్ని కన్న తర్వాత మొదటి భార్యను వదిలేశారని, కిరణ్‌రావుకు ఒక పిల్లవాడు ఉన్నాడని, ఇప్పుడు తాతయ్య కాబోతున్న సమయంలో మూడో భార్య కోసం ఆయన ఎదురు చూస్తున్నాడని వ్యాఖ్యానించారు.


''ఖాన్ లాంటి వాళ్లకు పిల్లల్ని కనడం తప్ప మరో వ్యాపకం లేదని అనే వాళ్ల వాదన సబబే'' సుధీర్ గుప్తా పేర్కొన్నారు. విభజన సమయంలో పాకిస్థాన్ తక్కువ జనాభా ఉన్నప్పటికీ ఎక్కువ భూభాగాన్ని సొంతం చేసుకుందని అన్నారు. ఇండియాలో పెరుగుతున్న జనాభాపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ, దేశంలో ఒక్క అంగుళం భూమి పెరగలేదని, జనాభా మాత్రం 140 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. కాగా, 15 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత తాము వేర్వేరుగా జీవించాలనే నిర్ణయం తీసుకున్నట్టు ఈనెల 3న అమీర్‌ఖాన్, ఆయన భార్య కిరణ్ రావు ప్రకటించారు.

Updated Date - 2021-07-12T21:23:01+05:30 IST