2021 ఆర్థిక బిల్లుకు పార్లమెంటు ఆమోదం

ABN , First Publish Date - 2021-03-25T01:27:17+05:30 IST

కీలకమైన 2021 ఆర్థిక బిల్లుకు పార్లమెంటు బుధవారంనాడు ఆమోదం తెలిపింది. దీంతో..

2021 ఆర్థిక బిల్లుకు పార్లమెంటు ఆమోదం

న్యూఢిల్లీ: కీలకమైన 2021 ఆర్థిక బిల్లుకు పార్లమెంటు బుధవారంనాడు ఆమోదం తెలిపింది. దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ఆర్థిక ప్రతిపాదనల అమలుకు మార్గం సుగగమైంది. ఈ బిల్లు లోక్‌సభలో మంగళవారం ఆమోదం పొందగా, రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. బిల్లుపై చర్చకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ, గతంలో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వ 'ఆర్థిక నిర్వహణా లోపాలను' ప్రస్తావించారు. 2020 మార్చి నాటికి నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏ) 8.99 లక్షల కోట్లకు తగ్గినట్టు చెప్పారు.


'యూపీఏ హయాంలో పరిస్థితులు గందరగోళంగా ఉండేవి. ఆర్థిక అవ్యవస్థ ఉండేది. ఇప్పుడు, ఎన్‌పీఏలు రూ.8.99 కోట్లకు తగ్గించగలిగాం' అని చెప్పారు. 2008 ఆర్థిక సంక్షోభానికి గత ఏడాది కోవిడ్ సంక్షోభం ఏమాత్రం భిన్నంగా లేదని సభకు తెలిపారు. కోవిడ్ సంక్షోభం పతాక స్థాయిలో ఉన్నప్పుడు కూడా ప్రధాని 100కి పైగా వర్చువల్ సమావేశాలు జరిపారని, గత ఏడాది కొన్ని మినీ బడ్జెట్లుతో పాటు 2021 కేంద్ర బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టామని, ఆర్థిక పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని చెప్పారు. అవినీతి రహిత ప్రభుత్వానికి ప్రధాని సారథ్యం వహిస్తున్నారని అన్నారు. మంత్రి సమాధానం అనంతరం ఆర్థిక బిల్లుకు రాజ్యసభ ఆమోదం పొందింది. దీంతో బడ్జెటరీ ప్రక్రియ పూర్తయింది.


జువనైల్ జస్టిస్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

జువనైల్‌ జస్టిస్‌ (పిల్లల భద్రత, సంరక్షణ) సవరణ బిల్లు-2021కు లోక్‌సభ బుధవారంనాడు ఆమోదం తెలిపారు. 'పిల్లలు నేరగాళ్లయ్యేంత వరకూ మనం చూస్తూ ఊరుకోరాదు. దేశ వ్యాప్తంగా 7000 చెల్డ్ షెల్టర్ హోమ్‌లలో అనేక లోటుపాట్లు గుర్తించాం. దేశ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా, అడ్మినిస్ట్రేషన్‌లో పిల్లలకు ప్రాధాన్యం కల్పిస్తున్నాం. భారతదేశంలోని పిల్లలు ఇకనుంచి డిస్ట్రిక్ మేజిస్ట్రేట్ల అడ్మినిస్ట్రేటివ్ ప్రాధాన్యతా క్రమాల జాబితాలో భాగస్వామ్యం చేస్తున్నాం' అని బిల్లును ప్రవేశపెడుతున్న సందర్భంగా మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. ఈ బిల్లుతో శిశు సంరక్షణ సంస్థల తనిఖీ, సమీక్ష, పర్యవేక్షణ బాధ్యతలు డీఎంలకు సంక్రమిస్తాయి.

Updated Date - 2021-03-25T01:27:17+05:30 IST